ముంబై : మహారాష్ర్టలో లాక్‌డౌన్ సడలింపు అంశంపై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, తనకు మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు తలెత్తలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. శివసేన మానస పుత్రిక సామ్నాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ర్టలో జూలై 31 వరకు విధిందిన లాక్‌డౌన్ నిబంధనల్ని సడలిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో శరద్ పవార్ కీలకంగా వ్యవహరించారని, అసలు లాక్‌డౌన్ నిబంధనల్ని సడలించడం సీఎం ఉద్దవ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరికి అభిప్రాయ బేధాలు తలెత్తాయన్న వార్తల్ని పవార్ ఖండించారు. 'ముఖ్యమంత్రితో సన్నిహితంగానే ఉన్నాను. కార్మిక సంఘాలు, వివిధ వ్యాపార యజమానులతో చర్చలు జరిపి దాని ఆధారంగానే ఓ అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాను. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారు.' దీన్ని అభిప్రాయ భేదం అని ఎలా అంటారని పవార్ ప్రశ్నించారు. (కరోనా : 3 రోజుల్లోనే.. లక్ష కేసులు)
కరోనా అత్యధికంగా ప్రభావితం అయిన ఢిల్లీ, కర్ణాటక రాష్ర్టాల్లో సైతం ఆంక్షలను ఎత్తివేశారని గుర్తుచేసిన పవార్..తిరిగి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించకపోతే దేశానికే నష్టం వాటిల్లుతుందని తెలిపారు. దీని ద్వారా కరోనా కంటే ఎక్కువ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర వికాస్ అగాడి ప్రభుత్వానికి శరద్ పవార్ రిమోట్ కంట్రలోలా పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రిగా ఉద్దవ్ బాధ్యతలు చేపట్టినా తెరవెనుక మాత్రం ప్రభుత్వాన్ని పవారే నడిపిస్తున్నారన్న ఆరోఫణల్ని పవార్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు రిమోట్ కంట్రోల్‌తో పనిచేయవంటూ వ్యాఖ్యానించారు. శివసేన మానసపుత్రిక సామ్నా వేరే పార్టీ నాయకుడిని ఇంటర్వ్యూ చేయడం ఇదే తొలిసారి కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా కరోనా వైరస్ నియంత్రణపై తీసుకుంటున్న చర్యలు, తదనంతరం రాజకీయ పరిణామాలు, భారతీయ జనతా పార్టీ, ఉద్దవ్ ఠాక్రేతో తనకున్న సత్సంబంధాలపై ఇంటర్వ్యూలో పవార్ స్పష్టతనిచ్చారు.
(మహారాష్ట్ర వైఖరిని తప్పుబట్టిన సుప్రీంకోర్టు)
Comments
Please login to add a commentAdd a comment