కాంగ్రెస్ కు అరుణ్ జైట్లీ సవాల్
న్యూఢిల్లీ: నోట్ల కష్టాలు డిసెంబర్ 30 వరకు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గురువారం లోక్ సభలో చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ సాహోసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో తాత్కాలికంగా నోట్ల కష్టాలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ ముందే చెప్పారని గుర్తు చేశారు.
అధికారంలో ఉండగా నల్లధనం నియంత్రణకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 2004-14 మధ్య కాలంలో పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ... నల్లధనాన్ని అరికట్టేందుకు ఒక్క చర్య తీసుకున్నా వెల్లడించాలని జైట్లీ సవాల్ విసిరారు.
పాత పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు గడిచినా నోట్ల కష్టాలు కొనసాగడంపై ప్రభుత్వాన్ని లోక్ సభలో విపక్షాలు గట్టిగా నిలదీశాయి. దీంతో లోక్ సభ కార్యకలాపాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.