యూటీపై నేనెవరితోనూ మాట్లాడలేదు: దిగ్విజయ్ సింగ్ | I did not discuss union territory status to Hyderabad: Digvijay Singh | Sakshi
Sakshi News home page

యూటీపై నేనెవరితోనూ మాట్లాడలేదు: దిగ్విజయ్ సింగ్

Published Wed, Oct 23 2013 5:26 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

యూటీపై నేనెవరితోనూ మాట్లాడలేదు: దిగ్విజయ్ సింగ్ - Sakshi

యూటీపై నేనెవరితోనూ మాట్లాడలేదు: దిగ్విజయ్ సింగ్

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేసే విషయమై తానెవరితోనూ మాట్లాడలేదని, ఎలాంటి చర్చా చేయలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్నది చాలా సున్నిత అంశమని, ఈ విషయాన్ని మంత్రుల బృందం చూసుకుంటుందని తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని హైదరాబాద్‌ను యూటీ చేస్తే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని కేంద్ర మంత్రి జేడీ శీలం చేసిన వ్యాఖ్యలను దిగ్విజయ్ వద్ద ప్రస్తావించగా ‘‘యూటీపై నేను ఎలాంటి చర్చా చేయలేదు. ఆయన ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఆయన తప్పర్థం చేసుకొని ఉండొచ్చు. నేనెప్పుడూ దీనిపై ఏదీ చెప్పలేదు. కేవలం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం వరకే మాట్లాడాను’’ అని చెప్పారు. ఇక హైదరాబాద్‌ను యూటీ చేసే విషయంలో మీరేమంటారు అని అడగ్గా ‘హైదరాబాద్ యూటీ అంశంపై విలేకరుల సమావేశంలో చర్చించలేం. ఇది చాలా సున్నిత సమస్య. దీన్ని మంత్రుల బృందం చూసుకుంటుంది’ అని బదులిచ్చారు.
 
 తీర్మానంపై తర్జనభర్జన..
 అసెంబ్లీలో రాష్ట్ర విభజన తీర్మానం అంశంపై స్పష్టత వచ్చిందా అని ప్రశ్నించగా ‘‘తీర్మానం విషయమై నేను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో చర్చించా. విభజనకు సంబంధించిన షెడ్యూల్‌ను పంపిస్తానని ఆయన నాకు వాగ్దానం చేశారు. అది చూశాక మీకు తెలుపుతా. అప్పటి వరకు దీనిపై స్పష్టత ఇవ్వలేను’’ అని దిగ్విజయ్ చెప్పారు. అసెంబ్లీ తీర్మానం కోరతారని మీరు భావిస్తున్నారా? అని అడగ్గా.. అది పూర్తిగా కేంద్ర హోంశాఖ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. చట్ట, న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు.
 
 రాజీనామాలపై తొందరపాటు చర్యలకు దిగొద్దని విజ్ఞప్తి చేసినా నలుగురు ఎంపీలు రాజీనామా చేశారని, వారిపై ఏమైనా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? అని అడగ్గా ‘‘నేను మరోమారు విజ్ఞప్తి చేస్తున్నా. వారు వాస్తవాలను గుర్తించుకోవాలి. విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇచ్చిన హామీని వారు గుర్తించాలి. హామీకి కట్టుబడాలి’’ అని బదులిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలపై ప్రశ్నించగా.. ‘‘ఆయన అత్యంత విధేయుడైన కాంగ్రెస్‌వాది.. ఆయన పార్టీని వదిలిపోరని నేను మీకు హామీ ఇవ్వగలను’’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటనలు చేసినా, ఇతరులెవరు ఏం చెప్పినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడే ఉందని దిగ్విజయ్‌సింగ్ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.
 
 పాలమూరు నుంచి రాహుల్‌ను పోటీకి దించాలి: డీకే అరుణ
 రాష్ట్ర మంత్రి డీకే అరుణ, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం దిగ్విజయ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నేతలు మల్లు రవి, జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని వారు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు జిల్లా పార్టీ నేతలు చేసిన తీర్మానం కాపీని వారు దిగ్విజయ్‌కు అందించారు. అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ ‘రాహుల్‌ను మహబూబ్‌నగర్ నుంచి పోటీకి దించాలని కోరాం. ఈ నెల 29న గద్వాలలో నిర్వహిస్తున్న తెలంగాణ జైత్రయాత్ర లో పాల్గొనాలని దిగ్విజయ్‌ను ఆహ్వానించాం’ అని తెలిపారు.
 
 దిగ్విజయ్‌తో కేంద్ర మంత్రి పల్లంరాజు భేటీ..
 కేంద్ర మంత్రి పల్లంరాజు కూడా దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు ఆయనతో చర్చించారు. మంత్రుల బృందం దృష్టికి తేవాల్సిన అంశాలు, సీమాంధ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కేంద్ర పర్యవేక్షణ కిందకు తేవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పినట్లు సమాచారం. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement