‘నా పని నేను చేస్తా.. వాళ్లేమన్నా అనుకోని’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి మధ్య వాగ్యుద్ధం కొనసాగుతునే ఉంది. ముఖ్యమంత్రి మమత విషయంలో తాను అన్న మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని గవర్నర్ త్రిపాఠి అన్నారు. ’నేనేం చెప్పానో ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను. వాళ్లకిష్టమొచ్చింది(మమతా బెనర్జీ తదితరులు) మాట్లాడుకోని. నేను నా విధులు నిర్వర్తిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో భారత ఆర్మీని రాజకీయం చేయొద్దు.. విమర్శలు చేయకూడదు’ అని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో శనివారం రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బెంగాల్‌లో టోల్ గేట్ల వద్ద ఆర్మీని మోహరించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి స్పందిస్తూ ‘ఆర్మీ లాంటి బాధ్యతాయుతమైన వ్యవస్థలపై ఆరోపణలు చేసేముందు జాగ్రత్తగా ఉండాలి. ఆర్మీని అప్రతిష్టపాలు చేయకూడదు’ అని అన్నారు. అనంతరం మమత స్పందిస్తూ ‘గవర్నర్ కేంద్ర ప్రభుత్వం పక్షాన మాట్లాడుతున్నారు. ఆయన ఎనిమిది రోజులుగా నగరంలో లేరు. ఏదైనా మాట్లాడేముందు అన్ని వివరాలను సరిచూసుకోవాల్సింది. ఆయన ఇలా మాట్లాడటం దురదృష్టకరం’ అన్నారు. దీనికి ప్రతిగా తన మాటలకు కట్టుబడి ఉంటానని గవర్నర్ అన్నారు.