మా రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
న్యూఢిల్లీ: బీజేపీ, కేంద్ర ప్రభుత్వం పట్ల ఘర్షణ వైఖరి అవలింభిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల కింద తమ రాష్ట్రానికి 10 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 10,459 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే విడుదల చేయాల్సిందిగా మోదీని కోరానని సమావేశానంతరం మమత చెప్పారు. నిధులను విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తానని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. పశ్చిమబెంగాల్ సమస్యల గురించి ప్రధానితో మమత చర్చించారు. బంగ్లాదేశ్‌తో తీస్తా నీటి పంపిణీకి సంబంధించి సత్వర పరిష్కారం కనుగొంటామని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మమత స్పందిస్తూ.. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.