
నేను సైలెంట్‌గా ఉండను: స్వామి
రాజకీయ ప్రత్యర్థులతో పాటు.. సొంత పార్టీ వాళ్లను కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టేవారిలో బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ముందుంటారు. గత కొంత కాలంగా ఎవరిపైనా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్‌గా ఉంటున్న ఆయన.. ఇక మీదట మాత్రం తాను అలా ఉండబోనని, కనీసం సోషల్ మీడియాలోనైనా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు. తనను సైలెంట్‌గా ఉండాలని ఆదేశించారంటూ కాంగ్రెస్ శకునిలా దుష్ప్రచారం చేస్తోందని, సోషల్ మీడియా చేతిలో ఉండగా.. ప్రధాన స్రవంతి మీడియాను ఎవరు పట్టించుకుంటారని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ అగ్రనేతలు తనను మాట్లాడొద్దని ఆదేశించినట్లు వచ్చిన కథనాలను ఆయన కొట్టిపారేశారు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో పాటు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తదితరులపై వ్యాఖ్యలు చేసినప్పుడు బీజేపీ అగ్రనేతలు ఆయనను కాస్త అదుపులో ఉండాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. ప్రధాని నరేంద్రమోదీ కూడా పరోక్షంగా స్వామి వ్యాఖ్యలను ఖండించారు. ప్రచారం కోసం తమ పార్టీవారైనా.. ఎవరైనా కూడా అలా చేయడం దేశానికి మంచిది కాదని ఆయన చెప్పారు. ఎవరైనా వ్యవస్థ కంటే పెద్దవాళ్లమనుకుంటే తప్పని అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో స్వామి ఎక్కడా ఆవేశంగా ప్రసంగించిన దాఖలాలు కనిపించలేదు. చర్చలు వేటిలోనూ ఆయన పాల్గొనలేదు. గత కొన్నివారాలుగా ఆయన వివాదాస్పద అంశాలపై కూడా స్పందించడం లేదు.
Congis are propagating on Shakuni's prodding that there is a gag order on me. Rubbish! When there is social media and PTs who cares for MSM?
— Subramanian Swamy (@Swamy39) 17 August 2016