న్యూఢిల్లీ: భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్‌ను భారత వాయుసేన (ఐఏఎఫ్)కు అప్పగించింది. 2015 సెప్టెంబర్‌లో అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థతో భారత వాయుసేన 22 అపాచీ హెలికాప్టర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే మొదటి హెలికాప్టర్‌ను అరిజోనాలోని మెసాలో భారతవాయుసేనకి అమెరికా అప్పగించిందని వాయుసేన అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ తెలిపారు. జూలైలో మొదటి హెలికాప్టర్ ఇండియాకు రానుంది.
2017లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు బోయింగ్ సంస్థతో రూ.4,168 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అపాచీ హెలికాప్టర్ రాకతో భారత వాయుసేన ఆధునీకరణ వైపు మరో ముందడుగు పడిందన్నారు. ఐఏఎఫ్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ హెలికాప్టర్ తయారైందని, పర్వత ప్రాంతాల్లో దీని సామర్థ్యం గణనీయమైన స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. శత్రువులపై కచ్చితత్వంతో కూడిన దాడులు చేయగల సామర్థ్యం ఈ హెలికాప్టర్లకు ఉందని, భూమిపై, గగనతలంలో కూడా దాడులు చేయగలదని భారత వాయుసేన అధికారి ఒకరు తెలిపారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టం సంయుక్తంగా ఈ హెలికాప్టర్ల విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment