పోలీసుల అదుపులో కేకే రంజిత్ (ఫైల్)
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసే సమయంలో కేకే రంజిత్ అనే సైనికుడు పాకిస్తాన్ కు కీలక రహస్యాలు చేరవేసినట్లు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. పాక్ నిఘా వర్గాలకు భారత ఎయిర్‌క్రాఫ్ట్స్ , వైమానిక దళానికి చెందిన మరింత కీలక సమాచారాన్ని చేరవేసి, భారీగా డబ్బు కూడబెట్టినట్లు రంజిత్‌పై ఆరోపణలున్నాయి.
పాక్‌కు చెందిన సంస్థలో పనిచేసే డామిని మెక్‌నాట్ అనే గూఢచారికి సోషల్ మీడియా సైట్లు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా కీలక విషయాలు వెల్లడించేవాడని తాజా ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో పొందుపరిచారు. మెక్‌నాట్ తానో జర్నలిస్టుగా పరిచయం చేసుకుని ఆపై రంజిత్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. ఐపీ అడ్రస్ ఆధారంగా రంజిత్‌పై అదనపు ఛార్జిషీటు దాఖలు చేశారు.
2015లో రంజిత్ అరెస్ట్
పాకిస్తాన్‌కు కీలక సమాచారంపై లీకులిస్తున్నాడన్న ఆరోపణలతో 2015లో భారత వాయుసేనలో ఎయిర్‌క్రాఫ్ట్స్‌కు సంబంధించి కీలక విధులు నిర్వహిస్తున్న రంజిత్‌ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్టుకు కొన్ని రోజుల ముందు భాటిండాలో విధులు నిర్వహిస్తుండగా ఆయనపై అనుమానం వచ్చి ఢిల్లీ క్రైం బ్రాంచ్, ఇంటెలిజెన్స్ అధికారులు, ఎయిర్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రంజిత్ అడ్డంగా బుక్కయ్యాడు. యూకేకు చెందిన మీడియా ప్రతినిధిగా చెప్పుకునే మెక్‌నాట్ ఫేస్‌బుక్ ద్వారా రంజిత్‌ను ట్రాప్ చేశాడు. ఆపై ఈమెయిల్స్, టెక్ట్స్ మెస్సేజ్‌లు, ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా రంజిత్ నుంచి రహస్యాలు రాబట్టి పాక్‌కు అప్‌డేట్స్ ఇచ్చేవాడు.