పుల్వామా : జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 39 మంది జవాన్లు మృతిచెందారు. అవంతిపొరలోని గొరిపొరలో మెయిన్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ముందుగా కాల్పులు జరిపి, అనంతరం వాహనాలు ఆగగానే ఐఈడీ బాంబు పేల్చారు. బాంబు పేలుడు దాటికి వాహనం తునాతునకలై, 39 మంది మృతిచెందగా, మరో 40 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెలుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు కాన్వాయ్‌లోకి కారును తీసుకెళ్లి తనను తాను పేల్చేసుకున్నాడు. దాడి సమయంలో కాన్వాయ్‌లో మొత్తం 70 వాహనాలు ఉన్నాయి. కారు నడిపిన ఉగ్రవాదిని పుల్వామా ప్రాంతానికి చెందిన అదిల్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. 2018లో అతడు జైషే మహ్మద్‌లో చేరాడు. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ (జేఈఎం) ప్రకటించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, డీజీ సీఆర్‌పీఎఫ్ ఆర్‌ఆర్ భట్నాగర్‌తో రాజ్‌నాథ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఉగ్రదాడిని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. అవంతిపురలో జవాన్ల మృతి వార్త నన్ను తీవ్ర కలవరానికి గురిచేసిందని, ఈ దారుణ ఉగ్రదాడిని ఖండించడానికి మాటలు రావడం లేదని పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దాడిపై విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమని, సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment