న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగులు కోవిడ్ బారిన పడుతుండటంతో కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖలోని పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల(డీఏఆర్‌పీజీ) విభాగం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు, ఉద్యోగులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కార్యాలయం పరిసరాల్లో తప్పనిసరిగా ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్‌లను ధరించాలనీ, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. వాడేసిన చేతి తొడుగులు, మాస్క్‌లు పడేయడానికి ప్రత్యేకించిన పసుపు రంగులోని బయోమెడికల్ చెత్తబుట్టలను వాడాలని తెలిపింది. సాధారణ చెత్తబుట్టల్లోగానీ, బహిరంగ ప్రదేశాల్లోగానీ వాడేసిన మాస్క్, చేతి తొడుగులు పడేసిన వారిపై నిబంధనల మేరకు చర్యలుంటాయని తెలిపింది. ‘ఎదురెదురుగా ఉండి మాట్లాడుకోవడం, ఎదురుగా కూర్చొని చర్చించుకోవడం, సమావేశాలు నిర్వహించుకోవడం మానేయాలి. బదులుగా ఇంటర్‌కం, మొబైల్స్, వీడియో కాన్ఫరెన్స్‌లను చర్చలకు వినియోగించుకోవాలి. సాధ్యమైనంత వరకు బోర్డు రూమ్స్‌లో కాకుండా, ఆఫీసుల నుంచే అధికారులు సమావేశాల్లో పాల్గొనాలి. అరగంటకోసారి చేతులు కడుక్కోవడం తప్పనిసరి. ఆఫీసుల్లో అన్ని చోట్లా శానిటైజర్లు ఉంచాలి. ఎక్కువ సార్లు తాకే స్థలాలను ప్రతి గంటకీ శుభ్ర పరుస్తుండాలి. కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు ఒక మీటర్ దూరాన్ని పాటించాలి’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment