ఆయన రెచ్చగొడుతుంటే, నిద్రపోతున్నారా?
లక్నో: ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే నిఘా వర్గాలు నిద్రపోతున్నాయా అని ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అబు అజ్మీ ప్రశ్నించారు. ఒకవేళ తీవ్రవాదులను జకీర్ నాయక్ ప్రోత్సహిస్తుంటే ఆయనపై చర్యలు తీసుకోకుండా దేశంలోని అధికారులంతా ఏమైపోయారని ఆయన నిలదీశారు. ఇస్లాంలోని వివిధ విశ్వాసాలు గల ప్రజల మనోభావాలను వెల్లడిస్తున్నందుకే ఆయనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు.
'జకీర్ నాయక్ 25 ఏళ్లుగా మత బోధకుడిగా ఉన్నారు. తీవ్రవాదులకు ఆయన ప్రేరణ ఇస్తుంటే ఇంతకాలం ఎందుకు ఆయనపై చర్య తీసుకోలేదు. ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపింది. అప్పటి వరకు ఆయనకు వ్యతిరేకంగా మీడియా విచారణ ఆపాల'ని అబు అజ్మీ పేర్కొన్నారు. హేతువాదులు నరేంద్ర దలోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కుల్బర్గీ హత్యలకు కారణమైన సనాతన సంస్థను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.