ఆసియా టాప్‌–50 వర్సిటీల్లో మూడు భారత్‌వే | IIT-Bombay ranking rises to 34 from 35 on QS Asia charts | Sakshi
Sakshi News home page

ఆసియా టాప్‌–50 వర్సిటీల్లో మూడు భారత్‌వే

Published Wed, Oct 18 2017 1:51 AM | Last Updated on Wed, Oct 18 2017 1:51 AM

IIT-Bombay ranking rises to 34 from 35 on QS Asia charts

న్యూఢిల్లీ: ఆసియాలోని అత్యుత్తమ 50 యూనివర్సిటీల జాబితాలో మూడు భారత విద్యాసంస్థలకు స్థానం దక్కింది. క్వాక్‌క్వాడ్రిల్లీ సైమండ్స్‌ (క్యూఎస్‌) సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ మొదటి స్థానంలో (నిరుడు 3వ స్థానం) నిలవగా.. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ రెండో స్థానం (గతేడాది మొదటి స్థానం) దక్కించుకుంది.టాప్‌–10 జాబితాలో భారత యూనివర్సిటీలకు చోటు దక్కలేదు.

ఐఐటీ–బాంబే 34వ స్థానంలో నిలవగా.. ఐఐటీ–ఢిల్లీ 41వ, ఐఐటీ–మద్రాస్‌ 48వ స్థానాలను దక్కించుకున్నాయి. టాప్‌ టెన్‌లో రెండు సింగపూర్‌ వర్సిటీలు, నాలుగు హాంకాంగ్‌ (హాంకాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ–3, యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌–5, సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌–8, ద చైనీస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌–10) వర్సిటీలు, ఒక దక్షిణ కొరియా వర్సిటీ (కొరియా అడ్వాన్స్‌డ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ–4), మూడు చైనా వర్సిటీలు (సింఘువా వర్సిటీ–6, ఫుడాన్‌ యూనివర్సిటీ–7, పెకింగ్‌ వర్సిటీ–9) చోటు దక్కించుకున్నాయి.

టాప్‌–100 జాబితాలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు (51), ఐఐటీ కాన్పూర్‌ (59), ఢిల్లీ యూనివర్సిటీ (72), ఐఐటీ రూర్కీ (93), ఐఐటీ గువాహటి (98)లు ఉన్నాయి. ఆసియాలోని 400కు పైగా వర్సిటీలను పరిశీలించిన ఈ సంస్థ.. యూనివర్సిటీల్లో అధ్యాపకుల అర్హత (పీహెచ్‌డీ), దేశ, విదేశీ విద్యార్థుల సంఖ్య, అకడమిక్‌ ఫలితాలు, విద్యార్థులు–అధ్యాపకుల నిష్పత్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాకింగ్‌ నిర్ణయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement