ఇక రైళ్లు ఢీకొనవు !
కోల్‌కతా: రైలు ప్రయాణాలు సురక్షితం చేసే దిశగా ముందడుగు పడింది. రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా నిరోధించే ఎలక్ట్రానిక్ రైల్వే ఇంటర్‌లాకింగ్ వ్యవస్థకు ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు కొత్త పరికరాన్ని కనుగొన్నారు. ఈ కొత్త వ్యవస్థను ఐఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ సంస్థ(ఆర్‌డీఎస్‌ఓ), రైల్వే సర్వీస్ ఇంప్రూవ్‌మెంట్ గ్రూపు(ఎస్‌ఐజీ) కలిసి అభివృద్ధి చేశాయి.
ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ పల్లబ్ దాస్‌గుప్తా మాట్లాడుతూ... ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలోని అనువర్తిత దోషాల వల్లే ప్రమాదాలు జరుగుతాయని, కొత్త పరికరం వాటిని తగ్గిస్తుందని తెలిపారు. ప్రతిపాదిత విధానంలో యార్డు లేవుట్ ప్రాతిపదికన భద్రతా ప్రమాణాల జాబితాను రూపొందించి తరువాత వాటిని బ్యాంక్ ఎండ్ మోడల్ చెకింగ్ విధానంలో పరిశీలిస్తారని చెప్పారు. ఈ పరికరాన్ని ఇప్పటికే పలు రైలు యార్డుల్లో విజయవంతంగా ప్రయోగించారని వెల్లడించారు. ట్రాఫిక్ ప్రణాళికలు, అత్యవసర పరిస్థితులకు ప్రత్యామ్నాయాల కోసం ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు అపార అవకాశాశాలున్నాయని పరిశోధకులు తెలిపారు.