ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్ త్వరలోనే ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టబోతోంది. దాదాపు 50 మందితో తొలిబ్యాచ్ 2019లో ప్రారంభమవుతుందని ఐఐటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమన్ కుమార్ భట్టాచార్య
ఖరగ్‌పూర్‌లో 2019 నుంచి ప్రారంభం
కోల్‌కతా: ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్ త్వరలోనే ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టబోతోంది. దాదాపు 50 మందితో తొలిబ్యాచ్ 2019లో ప్రారంభమవుతుందని ఐఐటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమన్ కుమార్ భట్టాచార్య బుధవారం తెలిపారు. దీనితో పాటు 400 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించనున్నట్లు చెప్పారు. ఐఐటీలకు ప్రత్యేక చట్టం ఉన్నందున ఐఐటీ–జేఈఈ తరహాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం తామే ప్రవేశపరీక్షను నిర్వహించుకుంటామన్నారు.
స్థానిక ప్రజలతో పాటు ఐఐటీ అవసరాలు తీర్చడానికే ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ ఆర్థోపెడిక్ డిపార్టుమెంట్లతో పాటు, డయాగ్నోస్టిక్ సెంటర్, ఎమర్జెన్సీ, ఔట్ పేషంట్ వార్డులున్న ఈ ఆసుపత్రి 2018 జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఆసుపత్రి ప్రారంభమైన వెంటనే భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అనుమతులు తీసుకుంటామని తెలిపారు. కోర్సు పాఠ్యాంశాల రూపకల్పనకు కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి ఇప్పటికే అనుమతి లభించిందన్నారు.