IIT-Kharagpur
-
ఐఐటీ చరిత్రలో ఖరగ్‌పూర్ రికార్డు.. ఏడాదికి వేతనం రూ.2 కోట్లకు పైనే!
దేశంలోని ప్రముఖ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్ ఈ ఏడాది ఐఐటీ చరిత్రలో అత్యధిక ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్నట్లు పేర్కొంది. ప్రతిష్టాత్మక ఐఐటీలో 1100 మందికి పైగా ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. "కరోనా మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ, ఐఐటీ ఖరగ్‌పూర్ అసాధారణ స్థాయిలో ప్రీ ప్లేస్ మెంట్ ఆఫర్లను(పీపీఓలు) పొందింది. ఇది భారతదేశంలోని అన్ని ఇతర ఉన్నత విద్యా సంస్థలలో పోలిస్తే చాలా ఎక్కువ" అని ఖరగ్‌పూర్ ఐఐటీ తెలిపింది. ఈ కరోనా మహమ్మారి సమయంలో కూడా విద్యార్థులు 35 అంతర్జాతీయ ఆఫర్లను పొందినట్లు సంస్థ తెలిపింది. సంవత్సరానికి ₹2-2.4కోట్ల ప్యాకేజీలతో ఇద్దరు ప్రధాన రిక్రూటర్లు రెండు పెద్ద ఆఫర్లు చేశారని తెలిపింది. "ఇప్పటి వరకు, మాకు ₹1 కోటికి వేతనంతో 20కి పైగా ఆఫర్లు వచ్చాయి" అని సంస్థ పేర్కొంది. ఐఐటీ ఖరగ్‌పూర్ ను సందర్శించిన రిక్రూటర్లలో క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఉబెర్, ఇంటెల్, అమెరికన్ ఎక్స్ ప్రెస్, హనీవెల్, శామ్ సంగ్, ఐబిఎమ్ ఉన్నాయి అని కళాశాల పేర్కొంది. ప్లేస్ మెంట్ సెషన్ డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు సాగిందని తెలిపింది. సాఫ్ట్ వేర్, ఎనలిటిక్స్, కన్సల్టింగ్, కోర్ ఇంజనీరింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ - అన్ని రంగాలలో 100కి పైగా కంపెనీలు నియామక ప్రక్రియలో పాల్గొన్నట్లు ఐఐటి-ఖరగ్ పూర్ ప్రతినిధి తెలిపారు. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారికి గుడ్‌న్యూస్..!) -
ఐఐటీలో ఎంబీబీఎస్
ఖరగ్‌పూర్‌లో 2019 నుంచి ప్రారంభం కోల్‌కతా: ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్ త్వరలోనే ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టబోతోంది. దాదాపు 50 మందితో తొలిబ్యాచ్ 2019లో ప్రారంభమవుతుందని ఐఐటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమన్ కుమార్ భట్టాచార్య బుధవారం తెలిపారు. దీనితో పాటు 400 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించనున్నట్లు చెప్పారు. ఐఐటీలకు ప్రత్యేక చట్టం ఉన్నందున ఐఐటీ–జేఈఈ తరహాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం తామే ప్రవేశపరీక్షను నిర్వహించుకుంటామన్నారు. స్థానిక ప్రజలతో పాటు ఐఐటీ అవసరాలు తీర్చడానికే ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ ఆర్థోపెడిక్ డిపార్టుమెంట్లతో పాటు, డయాగ్నోస్టిక్ సెంటర్, ఎమర్జెన్సీ, ఔట్ పేషంట్ వార్డులున్న ఈ ఆసుపత్రి 2018 జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఆసుపత్రి ప్రారంభమైన వెంటనే భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అనుమతులు తీసుకుంటామని తెలిపారు. కోర్సు పాఠ్యాంశాల రూపకల్పనకు కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి ఇప్పటికే అనుమతి లభించిందన్నారు. -
దేశంలో ఐఐటీ ఖరగ్‌పూర్ టాప్!
కోల్‌కతా: నియామకాల్లో దేశంలోని అన్ని వర్సిటీల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. క్యాంపస్ ప్లేస్మెంట్లు, విద్యా ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకుని ‘క్యూఎస్ ఎంప్లాయబిలిటీ’ అనే సంస్థ అంతర్జాతీయ సర్వే చేసింది. ఇందులో ప్రపంచంలోని టాప్ 100 వర్సిటీల్లో భారత్‌కు చెందిన ఖరగ్‌పూర్, ముంబై ఐఐటీలు చోటు సంపాదించుకున్నాయి. వరల్డ్ టాప్ 200 వర్సిటీల్లో మద్రాస్, ఢిల్లీ ఐఐటీలు ఢిల్లీ వర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఉంది. -
ఇక రైళ్లు ఢీకొనవు !
కోల్‌కతా: రైలు ప్రయాణాలు సురక్షితం చేసే దిశగా ముందడుగు పడింది. రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా నిరోధించే ఎలక్ట్రానిక్ రైల్వే ఇంటర్‌లాకింగ్ వ్యవస్థకు ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు కొత్త పరికరాన్ని కనుగొన్నారు. ఈ కొత్త వ్యవస్థను ఐఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ సంస్థ(ఆర్డీఎస్ఓ), రైల్వే సర్వీస్ ఇంప్రూవ్మెంట్ గ్రూపు(ఎస్ఐజీ) కలిసి అభివృద్ధి చేశాయి. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ పల్లబ్ దాస్‌గుప్తా మాట్లాడుతూ... ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలోని అనువర్తిత దోషాల వల్లే ప్రమాదాలు జరుగుతాయని, కొత్త పరికరం వాటిని తగ్గిస్తుందని తెలిపారు. ప్రతిపాదిత విధానంలో యార్డు లేవుట్ ప్రాతిపదికన భద్రతా ప్రమాణాల జాబితాను రూపొందించి తరువాత వాటిని బ్యాంక్ ఎండ్ మోడల్ చెకింగ్ విధానంలో పరిశీలిస్తారని చెప్పారు. ఈ పరికరాన్ని ఇప్పటికే పలు రైలు యార్డుల్లో విజయవంతంగా ప్రయోగించారని వెల్లడించారు. ట్రాఫిక్ ప్రణాళికలు, అత్యవసర పరిస్థితులకు ప్రత్యామ్నాయాల కోసం ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు అపార అవకాశాశాలున్నాయని పరిశోధకులు తెలిపారు. -
ఐఐటీలో 'బుల్లెట్' కోర్సు
కొల్కతా: ఖరగ్‌పూర్ ఐఐటీలో బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జ్ ప్రొఫెసర్ సుబ్రన్షు రాయ్ శుక్రవారం కొల్‌కత్తాలో వెల్లడించారు. ఏ ఏడాది చివరి నాటికి ఈ కోర్సు రూపకల్పన పూర్తి అవుతుందని... ఆ వెంటనే కోర్సును ప్రారంభిస్తామని చెప్పారు. అందుకు భవనాల నిర్మాణం కోసం రైల్వే పరిశధన కేంద్రం (సీఆర్ఆర్) రూ. 20 కోట్లు కేటాయించిందని తెలిపారు. మరో ఆరు నెలలో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే రైల్వే రంగంలో నాలుగు కీలక అంశాలపై కూడా పరిశోధనలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా రైల్వేలో స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రాయ్ విశదీకరించారు. ఇప్పటికే క్యాంపస్‌లోని ఐఐటీయన్లు హైస్పీడ్ ట్రైన్ బోగిలో టెక్నాలజీపై పని చేస్తున్నారని తెలిపారు. అలాగే రైల్వే టెక్నాలజీలో పరిశోధన, అభివృద్ధి కోసం రైల్వే శాఖ మరో రూ. 20 కోట్లు మంజురు చేసిందని రాయ్ వెల్లడించారు.