‘సరి-బేసి’ సాధించింది ఏమిటి?
తగ్గిన వాహనాల రద్దీ కాలుష్యంలో తగ్గింపుపై అస్పష్టత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యానికి కళ్లెం వేయడానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కారు తీసుకొచ్చిన ‘సరి-బేసి’ విధానాన్ని ఈ నెల 1 నుంచి 15వరకు ప్రయోగపూర్వకంగా అమలు చేశారు. సరి, బేసి సంఖ్యలున్న నాలుగు చక్రాల వాహనాలను రోజు మార్చి రోజు రోడ్లపైకి అనుమతించారు. ఈ పక్షం రోజుల్లో ‘సరి-బేసి’తో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు కాలుష్యం దాదాపు 40 శాతం తగ్గిందా? ట్రాఫిక్ రద్దీ మాయమైందా? అని ప్రశ్నిస్తే సానుకూల ఫలితాలే వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఈ విధానం వల్ల మాత్రమే కాలుష్యం తగ్గదని, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడాలని నిపుణులు చెబుతున్నారు.
డీజిల్ వాహనాల సంఖ్య తగ్గించి, కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని, సైకిల్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని అంటున్నారు.
తగ్గిన ట్రాఫిక్ రద్దీ .. సరి-బేసి రోజుల్లో చాలా రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గింది. ట్రాఫిక్ జామ్‌లూ చాలా వరకు తగ్గాయి. అయితే ప్రధాన కూడళ్లలో రద్దీ తగ్గలేదు. నగరం చుట్టుపక్కలున్న గుర్గావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ వంటి చోట్లనుంచి వాహనాలు ఎప్పట్లాగే పెద్దసంఖ్యలో వచ్చాయి. ఫోర్టిస్ హాస్పిటల్ నుంచి 10కి.మీ దూరం వెళ్లడానికి ఇదివరకు 35 నిమిషాలు పట్టేదని, ‘సరి-బేసి’తో 18 నిమిషాల్లో వెళ్లగలుతున్నానని ఓ అంబులెన్స్ డ్రైవర్ చెప్పారు.
వాహనాల సంఖ్య తగ్గడం వల్ల ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకోడానికి నలుగురు, ఐదుగురు కలసి కారులో(కార్ పూలింగ్) వెళ్లారు, బస్సులు, రైళ్లను కూడా ఆశ్రయించారు. ప్రభుత్వ విధానాల్లో ప్రజల భాగస్వామ్యానికి సరి-బేసి ఒక ఉదాహరణ అని, దీన్ని మిగిలిన రంగాల్లోనూ అమలు చేయాలని పాలనా నిపుణులు చెబుతున్నారు.
కాలుష్యం తగ్గిందా?.. ఢిల్లీలో కాలుష్యానికి వాహనాలు మాత్రమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. పక్షం రోజుల్లో కాలుష్య స్థాయిలు తగ్గాయని రాష్ట్ర సర్కారు చెబుతున్నా, చాలాచోట్ల ఇంతకుముందున్న స్థాయిలే కొనసాగాయని అంటున్నారు. అయితే గతంతో పోలిస్తే కాలుష్యం తగ్గిందని మరికొందరు అంటున్నారు. కస్తూర్బా నగర్‌లోని ద్యాల్‌సింగ్ కాలేజీ ప్రాంతంలో పీఎం10(10 మైక్రోమీటర్ల వరకు ఉన్న పదార్థం) క్యూబిక్ మీటరుకు 149 మైక్రోగ్రాములుగా నమోదైంది. తూర్పు ఢిల్లీలోని పత్పర్‌గంజ్‌లో 500 మైక్రోగ్రాములకు చేరింది. జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) ప్రకారం పీఎం10 స్థాయి 100 మైక్రోగ్రాములు ఉంటేనే సురక్షితం.
అతిసూక్ష్మ కణాలైన పీఎం2.5 (2.5 మైక్రోమీటర్ల కంటే చిన్నది) పరిమిత స్థాయి క్యూబిక్ మీటరుకు 66 మైక్రోగ్రాములు కాగా కమలానెహ్రూ కాలేజీ వద్ద 226 మైక్రోగ్రాములు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్(కైలాస్) వద్ద 217 గ్రాములుగా నమోదైంది. ప్రభుత్వం మాత్రం పీఎం10 స్థాయి 450 నుంచి 250 వరకు తగ్గిందని చెబుతోంది. కాలుష్య స్థాయిలు వాహనాల వల్లే కాకుండా గాలి, వాతావరణం, ఇతర స్థానిక ఉద్గారాలపై ఆధారపడి ఉంటుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్(సీఎస్‌ఈ) చెప్పారు. తగ్గింపుపై ఇంకా స్పష్టత రావాలని, పక్షం రోజుల్లో ఫలితాలపై తుది అంచనాకు రాలేమని నిపుణులు చెబుతున్నారు.
కార్ల కాలుష్యం 40% తగ్గింది: సీఎస్‌ఈ
‘సరి-బేసి’తో ఢిల్లీలో కార్ల నుంచి వచ్చే ఉద్గారాలు 30- 40 శాతం వరకు తగ్గాయని సీఎస్‌ఈ తెలిపింది. వీధుల్లో కార్ల సంఖ్య తగ్గడమే దీనికి కారణమని సంస్థ ప్రతినిధి వివేక్ ఛటోపాధ్యాయ చెప్పారు.
త్వరలో మెరుగైన విధానం: కేజ్రీ
సరి- బేసి వాహన వినియోగం విధానం విజయవంతమైందని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. విధానంలో లోటుపాట్లను అధ్యయనం చేసి.. మెరుగుపర్చిన విధానాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. ‘సరి-బేసి’కి సహకరించిన పౌరులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘సరి-బేసి’కి మద్దతుగా మరి కొందరితో కలిసి తన వాహనాన్ని పంచుకున్న సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను ప్రశంసిస్తూ.. ఆయన చర్య లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు.