'భారతీయులందరి శ్వాస'గా అభివర్ణించే రాజ్యాంగం ఏం చెబుతోంది. ఎన్నో హక్కులతో పాటు భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సమాజంలో గౌరవప్రదంగా బతికే హక్కును కల్పిస్తోందని నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యులైన జవహర్‌లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ తదితరులు నిర్వచనం ఇచ్చారు. కులం, మతం, లింగ, పుట్టుక వివక్షతతో సంబంధం లేకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తూ అన్నివర్గాల ప్రజల సమష్టి మనోభావాలను గౌరవించాలని, సమానత్వం, న్యాయం, స్వాతంత్య్రం ప్రాతిపదిక భారతీయత అనే భావాన్ని పరిరక్షించేందుకు ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కృషిచేయాలని రాజ్యాంగం చెబుతోంది. బీఆర్ అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిసారిగా గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలను అమలు చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మోదీ దేశ ప్రజలకు ట్విట్టర్ సందేశం ఇచ్చారు.
అసలు ఇప్పుడేం జరుగుతోంది?
నీతులు వల్లిస్తున్న ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి, నియమావళికి కట్టుబడి పనిచేస్తోందా? కొన్ని నెలలుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఉండటమే దీనికి సమాధానం. 2014 మే నుంచి 2015 మే వరకు మైనారిటీలకు వ్యతిరేకంగా దేశంలో 600 హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో ముస్లింలకు వ్యతిరేకంగా 406, క్రైస్తవులకు వ్యతిరేకంగా మిగతావి జరిగాయి. దాద్రి, ఉధంపూర్, ఉచెకాన్ మోయిబా తాంగ్‌కాంగ్ (మణిపూర్) సంఘటనలు వాటిలో మరీ తీవ్రమైనవి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఓ మనిషి ప్రాణం తీసిన సందర్భాలూ ఉన్నాయి. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతున్న విషయం తెల్సిందే.
ఈ అసహనం దళితులకు వ్యతిరేకంగా దాడులకు కూడా దారితీసింది. 2014లో దళితులకు వ్యతిరేకంగా 47,064 సంఘటనలు నమోదయ్యాయి. గత ఏదాడితో పోలిస్తే దళితులపై దాడులు 19 శాతం పెరిగాయి. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంఘ పరివారం ఈ దాడులకు పాల్పడిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. రాజ్యాంగ విధుల ప్రకారం ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా నివారించడం, జరిగిన కేసుల్లో దోషులకు శిక్ష పడేలా కఠినంగా వ్యవహరించడం అధికారంలో ఉన్న కేంద్రం బాధ్యత. శాంతిభద్రత పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించడం కూడా ప్రభుత్వ ధర్మం. అయితే ఇప్పటి ప్రభుత్వం మౌనం వహిస్తూ బాధ్యతలను విస్మరిస్తోందన్నది విపక్షాల విమర్శ.
సమాజంలోని కొన్ని శక్తులు రాజ్యాంగాన్ని విశ్వసించకపోవచ్చు. రాజ్యాంగ నియమ నిబంధనల పట్ల వారికి ఇసుమంత గౌరవం కూడా లేకపోవచ్చు. సాక్షాత్తు నరేంద్ర మోదీ తన గురువుగా చెప్పుకొనే ఎమ్మెస్ గోవాల్కర్ రాజ్యాంగ ప్రతిని తగులబెట్టమని ఓ సందర్భంలో పిలుపునిచ్చారు. దీనికి బదులు 'మనుస్మృతి'ని భారత రాజ్యాంగంగా చేస్తే అంగీకరించేవాడినని వ్యాఖ్యానించారు.
భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వాలకు మాత్రం రాజ్యాంగాన్ని తు.చ. తప్పక పాటించాల్సిన బాధ్యత ఉంది. సర్వమత సమానత్వానికి కృషిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. 'గురూజీ: ఏక్ స్వయం సేవక్' అనే పేరిట ఎమ్మెస్ గోవల్కర్ జీవితంపై 2010లో పుస్తకం రాసిన నరేంద్ర మోదీలో రాజ్యాంగ స్ఫూర్తి ఏ మేరకు ఉందో కాలమే చెప్పాలి!
రాజ్యాంగంలో ఏముంది.. అసలేం జరుగుతోంది?
Published Thu, Nov 26 2015 3:38 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement