10వేలమంది జనవరి 1నే పుట్టారట...
అలహాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని వారంతా జనవరి 1వ తేదీనే పుట్టారట. అమ్మ, నాన్న, తాత, అమ్ముమ్మ, నానమ్మ, అత్త, మామయ్యలు, పిన్ని, బాబాయ్, పిల్లలు పక్కింటి వాళ్లు, ఎదురింటివాళ్లు... ఇలా ఒకరేంటి..అందరూ ఒకేరోజు పుట్టారు. అదెలా సాధ్యమనుకుంటున్నారా?.
కంజాసా గ్రామస్తులంతా తాము పుట్టింది జనవరిలోనే అని .. ఆధార్ కార్డులో నమోదు చేసుకోవడమే. సుమారు పదివేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలోని వారంతా తామంతా పుట్టింది జనవరి ఒకటో తేదీ అని పేర్కొనటం విశేషం. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు, పలు పనులకు ఆథార్ కార్డును అనుసంథానం చేయడంతో, కార్డు పొందటానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశ్యంతో వీరంతా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు... విద్యార్థుల ఆధార్ కార్డు సంఖ్యను నమోదు చేయడానికి వచ్చినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా యూపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై గ్రామ పెద్ద రామ్ డులారి మాట్లాడుతూ ‘తాము ఆధార్ కార్డు నమోదు సందర్భంగా జనన తేదీపై తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ లోపాన్ని సరిదిద్దుతామని, గ్రామస్తులందరికీ కొత్త ఆధార్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు.