అహ్మదాబాద్ః ఎవరినైనా అవమానించాలనుకున్నపుడు, శిక్ష విధించాలనుకున్నపుడు వారికి గుండు గీయించి, లేదా ముఖానికి నల్ల రంగు పూసి గాడిదపై ఊరేగించడం దక్షిణాసియా రాష్ట్రాల్లో పురాతన ఆచారంగా కనిపిస్తుంది. అయితే గుజరాత్ రాష్ట్రంలో నేటికీ అటువంటి ఆచారం ఒకటి కొనసాగుతోంది. అయితే దాని వెనుక కారణం మాత్రం భిన్నంగా ఉంది. గాడిదపై ఊరేగితే కొడుకులు పుడతారన్నది అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. అందుకే ఆ గ్రామంలో గాడిదలకు నేటికీ గిరాకీ కొనసాగడమే కాదు... దానిపై ఊరేగేందుకు ప్రజలు ఏకంగా వెయిటింగ్ లిస్టులో ఉండటం విశేషం.
గుజరాత్ జనగథ్ జిల్లా బోర్ వావ్ గ్రామానికి చెందిన రమేష్ సువాగియా అనే 38 ఏళ్ళ రైతు గాడిదను ఎక్కేందుకు ముందుగా తన ముఖానికి నల్లని రంగు పూసుకున్నాడు. గాడిదపై ఎక్కి గ్రామమంతా తిరుగుతూ బిక్షమెత్తేందుకు సిద్ధమయ్యాడు. గురువారం సంప్రదాయ పండుగ 'ధులేటి' (వారసులకోసం జరిపే పండుగ) సందర్భంలో తమ గ్రామంలో ఆచారంగా వస్తున్న గాడిదస్వారీ చేసేందుకు వేచిఉన్నవారిలో రమేష్ ఒకడు. పూర్వకాలంనుంచీ 'రాంగ్' పేరున గ్రామంలో ఈ వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పండుగనాడు గాడిదపై ఎక్కి గ్రామమంతా తిరుగుతూ అందరివద్దా గోధుమలు, డబ్బును వసూలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సంప్రదాయం ఒకప్పుడు పక్షుల మేతకోసమే ప్రారంభమైనట్లు చెప్తారు. ఇలా వసూలు చేసిన వాటిని సంవత్సరమంతా అక్కడి పక్షుల మేతకు వినియోగిస్తుంటారు. అయితే ఇదే సంప్రదాయంలో భాగంగా ఇలా చేస్తే వారసులు జన్మిస్తారన్న నమ్మడంతో కొడుకులు పుట్టాలనుకున్నవారు దీన్ని కొనాసాగిస్తున్నారు.
నాకు 17, 6 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారని.. ఈ సంప్రదాయాన్ని నేను ఏడేళ్ళక్రితం పాటించడం ప్రారంభించానని చెప్తున్నాడు రమేష్. తమ నమ్మకాన్ని మరింత పెంచే విధంగా గతేడాది తనకు కొడుకు పుట్టాడని, గాడిదపై ఊరేగుతూ ఈ సంప్రదాయం కొనసాగించడంలో తమకెటువంటి సంకోచం లేదని రమేష్ సువాగియా చెప్తున్నాడు. వచ్చే ఐదేళ్ళలో రాంగ్స్ పద్ధతిని పాటించేందుకు గ్రామంలోని సుమారు పది కుటుంబాలు ప్రతిజ్ఞ చేసి, వేచి చూస్తున్నాయని, ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని తాము రెండు గాడిదలను అందుబాటులో ఉంచామని డిప్యూటీ సర్పంచ్ ప్రవీణ్ వాడి తెలిపారు. అయితే ఈ ఆచారం దశాబ్దాలుగా కొడుకు పుట్టాలని కోరుతూ కొనసాగుతోందని, మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడు పిల్లల్లేని దంపతులు, ఆడపిల్లల కోసం కొనసాగించేందుకు ప్రోత్సహిస్తున్నామని సర్పంచ్ ప్రకాష్ గిరి అపర్నాథ్ తెలిపారు.
కొడుకుల కోసం గాడిద స్వారీ..!
Published Thu, Mar 24 2016 1:44 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement