
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరు సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్, ఇటలీ దేశాలు నిర్ణయించాయి. అన్ని దేశాలూ ఉగ్రవాదంపై పోరాటంలో కలసి రావాలని పిలుపునిచ్చాయి. సోమవారం భారత్, ఇటలీ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, పాలో జెంటిలోని మధ్య ఢిల్లీలో ద్వైపాక్షిక వాణిజ్యం, విద్యుత్ సహా పలు రంగాల్లో సహకారానికి సంబంధించి విస్తృతమైన చర్చలు జరిగాయి. ఉగ్రవాద కేంద్రాలు, వారికి సమకూరుతున్న మౌలిక వసతులు, నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించటంతోపాటుగా సీమాంతర ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాల్సిందేనని సంయుక్త ప్రకటనలో పరోక్షంగా పాకిస్తాన్‌పై విమర్శలు చేశారు.
‘ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నీ భద్రతామండలి తీర్మానాలకు అనుగుణంగా ఉగ్రసంస్థలపై నిషేధం విధించాలని కోరుతున్నాం’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా మరోసారి అడ్డంకులు సృ ష్టించొచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. 2012లో కేరళ తీరంలో భారతీయ మత్స్యకారులను ఇటలీ నౌకాదళ సిబ్బంది కాల్చిచంపిన తర్వాత ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాలను పక్కనపెట్టి.. భారత్‌తో రాజకీయ, ఆర్థిక బంధాలను బలోపేతం చేసుకునే ప్రధాన ఉద్దేశంతోనే ఇటలీ ప్రధాని ఆదివారం రాత్రి రెండ్రోజుల భారత పర్యటనకు వచ్చారు.
ఇటలీకి విస్తృత వ్యాపార అవకాశాలు
సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై కలసి పనిచేసేందుకు నిర్ణయించామన్నారు. ‘భారత్, ఇటలీ రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు, మన ఆర్థిక వ్యవస్థల బలమే ఇరు దేశాల మధ్య వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు చాలా అవకాశాలు కల్పిస్తుంది. ఇరుదేశాల మధ్య 8.8బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 57వేల కోట్లు) ద్వైపాక్షిక వ్యాపారం జరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీలతోపాటుగా ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, మౌలిక వసతుల రంగాల్లో ఇటలీ కంపెనీలకు గొప్ప అవకాశాలున్నాయన్నారు. ‘నేటి ప్రపంచంలో రోజుకో కొత్త సవాలు ఎదురవుతున్న నేపథ్యంలో.. ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపైనా మేం చర్చించాం.
భద్రతాపరమైన సవాళ్లపై చర్చించాం. ఉగ్రవాదంపై పోరు, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారంతో ముందుకెళ్లాలని నిర్ణయించాం’ అని మోదీ తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇటలీతో ఉన్న భాగస్వామ్యాన్ని గుర్తుచేసిన మోదీ.. ఈ రంగంలో మరింత సహకారంతో ముందుకెళ్లాలని నిశ్చయించినట్లు పేర్కొన్నారు. జెంటిలోని మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య ఉన్న సత్సంబంధాల కారణంగా కంపెనీలు, శాస్త్ర సహకారంలో భారీ అవకాశాలను కల్పిస్తోందన్నారు. భారత్‌లో పెట్టుబడుల విషయంలో ఇటలీ చాలా ఆసక్తిగా ఉందన్నారు. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాల పునరావిష్కరణ అని పేర్కొన్నారు.