ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు!
- తొలిదశ రికార్డు పోలింగ్‌పై జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రధాని ప్రశంసలు
- మెజారిటీ ఇస్తే రాష్ట్రాన్ని వృద్ధి పథాన నిలుపుతా
- అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ హామీ
పూంఛ్/ఉధంపూర్: అసెంబ్లీ ఎన్నికల తొలిదశలో రికార్డు పోలింగ్ శాతం నమోదు చేసిన జమ్మూకశ్మీర్ ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలతో ముంచెత్తారు. బులెట్‌ను కాదని బ్యాలెట్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా వేర్పాటువాదులకు సరైన జవాబిచ్చారని అభినందించారు. ఫలితాలతో సంబంధం లేకుండా ఇది ప్రజాస్వామ్య విజయమని అభివర్ణించారు. ‘బాంబులను, తుపాకీలను ఉపయోగించినా, ప్రజలను చంపినా.. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉండటంతో ఉగ్రవాదులు నిరాశానిస్పృహల్లో మునిగిపోయారు.
మమ్మల్ని భయపెట్టడం ఇక కుదరదని మీరు వారికి తేల్చి చెప్పారు’ అని జమ్మూకశ్మీర్ ప్రజలను ప్రశంసించారు. దీనికి భారతీయులంతా మిమ్మల్ని అభినందిస్తున్నారన్నారు. డిసెంబర్ 2న జరగనున్న రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన పూంఛ్, ఉధంపూర్‌ల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫెరెన్స్, కాంగ్రెస్, పీడీపీలపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీలు అవినీతిలో కూరుకుపోయి, రాష్ట్రాన్ని దోచుకోవడంతో గత 30 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు.
ప్రజలు తిరస్కరించినా.. సంకీర్ణ ప్రభుత్వాల పేరుతో విడతలవారీగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ధ్వజమెత్తారు. వంశపారంపర్య, కుటుంబ రాజకీయాలు వ్యాధులని, రాష్ట్ర ప్రజలు సహకరిస్తే వాటిని నిర్మూలిస్తానని వ్యాఖ్యానించారు. ‘కేంద్రం భారీ ఎత్తున పంపిన నిధులు సక్రమంగా మీకు చేరితే.. దేశంలోనే మీరు అత్యంత సంపన్నులుగా ఉండేవారు’ అని పేర్కొన్నారు. మీ అభివృద్ధిని అడ్డుకున్న పార్టీల దుకాణాలను మూసేయండని ఓటర్లకు మోదీ పిలుపునిచ్చారు.
‘గతంలో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఆ పార్టీలే అధికారంలో ఉండటంతో.. మీ సొమ్మును యథేచ్ఛగా దోచుకున్నారు. నేను అధికారంలోకి వచ్చాక, నిధుల వినియోగంపై పట్టు బిగించడంతో నాపై కోపం పెంచుకున్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధికి నిధుల కొరత ఉండదు. కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఈ రాష్ట్ర ప్రజలకు కూడా సమాన హక్కు ఉంది’ అన్నారు. బీజేపీకి పూర్తి మెజారిటీ ఇస్తే.. గత 30 ఏళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధిని ఐదేళ్లలో సాధిస్తానని, అవినీతికి తావు లేకుండా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. ఇటీవలి వరదలను ప్రస్తావిస్తూ.. ‘మీ బాధను నా బాధలా భావించాను. మీ కన్నీళ్లు తుడవడం కోసం దీపావళి కూడా జరుపుకోకుండా ఇక్కడికి వచ్చాను’ అని గుర్తు చేశారు. పూంఛ్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. ‘న్యూఢిల్లీ నుంచి ఇక్కడికి రావడానికి 24 గంటల సమయం మాత్రమే పడుతుంది.
కానీ గత 40 ఏళ్లలో ఏ ఒక్క ప్రధాని ఇక్కడికి రాలేదు’ అన్నారు. 40 ఏళ్ల క్రితం మొరార్జీ దేశాయి వచ్చారని, ఇప్పుడు తాను వచ్చానని చెప్పారు. ‘ప్రధానిగా ఇక్కడికి మొదటిసారి వచ్చాను కానీ.. అంతకుముందు పార్టీ కార్యక్రమాల కోసం చాలాసార్లు బస్‌లో వచ్చాను. అప్పుడు చాలామంది నాకు ఆతిథ్యం ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి వారందరి రుణం తీర్చుకోవాలని ఉంది’ అన్నారు.