న్యూఢిల్లీ : శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం దేశమంతటా ఈద్ ఉల్ ఫితర్ (రమజాన్) పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 7.35 గంటలకు నెలవంక కనిపించిందని జమా మసీదు షాహీ ఇమామ్ బుఖారీ ప్రకటించారు. దేశ ప్రజలకు రమాజన్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన తెలిపారు.
ఈద్ ఉల్ ఫితర్‌తో పవిత్ర రమాజాన్/రంజాన్ మాసం ముగుస్తుంది. 30 రోజులపాటు ఉపవాసం ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈ పర్వదినాన్ని జరుపుకునే ముస్లింలు రమజాన్ సందర్భంగా తమ బంధుమిత్రులు, ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలుపుతారు. మసీదులు, ఈద్గాలు, నిర్దేశిత బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు నిర్వహిస్తారు. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ నిరుపేదలకు సహాయం చేస్తారు.
రమజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈద్ ముబారక్. దేశ పౌరులందరికీ, ప్రత్యేకంగా దేశవిదేశాల్లోని మన ముస్లిం సోదర, సోదరిమణులకు పండుగ శుభాకాంక్షలు. ఈ సంతోషకరమైన సందర్భం మన కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని, మన సమాజం పరస్పర ప్రేమానురాగాలను పెంపొందించాలని కోరుకుంటున్నాను’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
‘ఈద్ ముబారక్, ఈ పర్వదినం సమాజంలో మన ఐక్యతను, సామరస్యాన్ని మరింత పెంపొందించాలని ఆశిస్తున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా దేశ ప్రజలకు రమజాన్ శుభాకాంక్షలు చెప్తూ.. ఆడియో ఫైల్‌ను షేర్ చేశారు. పలువురు జాతీయ రాజకీయల నాయకులు, పలువురు ప్రముఖులు కూడా రమజాన్ శుభాకాంక్షలుత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment