సరిహద్దులను మూసేయండి | India COVID-19 death toll rises to 27 as total cases reach 1024 | Sakshi
Sakshi News home page

సరిహద్దులను మూసేయండి

Published Mon, Mar 30 2020 4:34 AM | Last Updated on Mon, Mar 30 2020 10:03 AM

India COVID-19 death toll rises to 27 as total cases reach 1024 - Sakshi

కుటుంబాలతో సహా తమ గ్రామాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని లాల్‌ క్వార్టర్‌ బస్టాండ్‌ వద్ద బస్సుల కోసం వేచి చూస్తున్న వలస కార్మికులు

న్యూఢిల్లీ:  వలస కూలీల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి జరగకుండా అడ్డుకోవడం కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులను మూసేయాలని కేంద్రం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి సరిహద్దులను దాటేందుకు ప్రయత్నించిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. అయితే, కేంద్రం కఠినమైన ఆదేశాలను జారీ చేసినప్పటికీ.. వేల సంఖ్యలో ఉపాధి కరువైన వలస కూలీలు మూకుమ్మడిగా నగరాల నుంచి తమ స్వస్థలాలకు కాలినడక సహా తమకు వీలైన అన్ని మార్గాల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసుల సంఖ్య ఆదివారం సాయంత్రానికి 1,024 అని, మరణాల సంఖ్య 27 అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

గత 24 గంటల్లో భారత్‌లో 8 మరణాలు, చోటు చేసుకున్నాయని ప్రకటించింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 6, గుజరాత్‌లో 5, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్‌లో 2, ఢిల్లీలో 2, జమ్మూకశ్మీర్లో 2, తెలంగాణ, కేరళ, తమిళనాడు, బిహార్, పంజాబ్, పశ్చిమబెంగాల్, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో ఒక్కొక్కటి చొప్పున మరణాలు చోటు చేసుకున్నాయి. కాగా, ఆదివారం కొత్తగా నమోదైన కేసుల్లో స్పైస్‌జెట్‌ పైలట్‌ ఒకరు కూడా ఉన్నారు. అయితే, ఆయనకు మార్చి నెలలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన చరిత్ర లేకపోవడం గమనార్హం. లాక్‌డౌన్‌ కారణంగా, ఇళ్లకే పరిమితమై పలువురు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. నిమ్‌హ్యాన్స్‌ 08046110007 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసిందన్నారు.

వలస కూలీల విషాదం: కరోనా సమస్య దేశంలో మరో సంక్షోభానికి కారణమైంది. వైరస్‌ వ్యాప్తి ప్రమాదమున్నప్పటికీ.. దేశవ్యాప్తంగా వేలాదిగా వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఆంక్షల నడుమనే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా, ఢిల్లీ– యూపీ సరిహద్దులు, కేరళ, మహారాష్ట్రల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కూలి ఢిల్లీ నుంచి స్వస్థలానికి వెళ్లేందుకు 200 కిమీలు నడిచి, ఉత్తరప్రదేశ్‌లో గుండెపోటుతో మరణించిన విషాదం ఆదివారం చోటు చేసుకుంది. ‘ఏదో వైరస్‌ అందరినీ చంపేస్తుందని అంటున్నారు. నాకవేమీ తెలియదు. ఇక్కడ ఉంటే నా పిల్లలకు అన్నం పెట్టలేకపోతున్నా.

ఆ వైరస్‌తో చావడం కన్నా ముందు ఆకలితో చనిపోయేలా ఉన్నాం’ అని ఢిల్లీలో కూలి పనులు చేసుకునే సావిత్రి ఆవేదన వ్యక్తం చేసింది. మథుర హైవే మీదుగా 400 కిమీల దూరంలో యూపీలో ఉన్న తమ స్వగ్రామానికి కాలి నడకనైనా సరే వెళ్లేందుకు ఆమె తన పిల్లలతో కలిసి పయనమైంది. ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లో వేలాదిగా కూలీలు, ఇతర సామాన్యులు తమ ఊర్లకు వెళ్లేందుకు హైవేపై నిలిచి ఉన్నారు. ఈ సామూహిక ప్రయాణాలతో వైరస్‌ మరింత ప్రబలే ప్రమాదముందని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల్లో లాక్‌డౌన్‌ కొనసాగినంత కాలం ప్రయాణికుల రాకపోకలను నిలిపేయాలని కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల డీజీపీలు, చీఫ్‌ సెక్రటరీలను ఆదేశించారు.

అయితే, అత్యవసర, అత్యవసరం కాని వస్తువులనే భేదం చూపకుండా సరుకులు సరఫరా చేసే అన్ని వాహనాలను అనుమతించాలని అజయ్‌ భల్లా స్పష్టం చేశారు. దిన పత్రికల సరఫరాకు కూడా అంతరాయం కలిగించకూడదన్నారు.  సామాన్యులు, దినసరి కూలీల నుంచి ఇంటి అద్దె డిమాండ్‌ చేయవద్దని యజమానులను ఒక ప్రకటనలో ప్రభుత్వం కోరింది. సామాన్యులు, విద్యార్థులు, ఇతర కూలీలను అద్దె ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే..  వారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల కూలీలకు భోజన, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

ప్రధాని సమీక్ష
కరోనాపై పోరు కోసం తీసుకున్న చర్యల గురించి ప్రధాని మోదీ స్వయంగా సమీక్షిస్తున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఆరోగ్య మంత్రులు, వైద్య నిపుణులు సహా ప్రతీ రోజు దాదాపు 200 మంది నుంచి ఆయన వివరాలు తెలుసుకుంటున్నారు.

అంబులెన్స్‌ సిబ్బందికి ప్రామాణిక మార్గదర్శకాలు
కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించే విషయంలో అంబులెన్స్‌ సిబ్బందికి కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రామాణిక మార్గదర్శకాలు జారీ చేసింది. అంబులెన్స్‌ డ్రైవర్లకు, సాంకేతిక ఇబ్బందికి ఇవి వర్తిస్తాయి. బాధితులను ఆసుపత్రులకు తరలిస్తుండగా వీరు సైతం కరోనా బారినపడుతున్నట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. అంబులెన్స్‌ల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. వీటిలో పని చేసే వారంతా తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు ఆధునిక రక్షణ పరికరాలు ఉపయోగించాలని స్పష్టం చేసింది.

అంబులెన్స్‌లోని రోగికి, అతడి సహాయకుడికి మూడు పొరల మాస్కులు, గ్లోవ్స్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.  కోవిడ్‌–19 కేసులను ఎలా గుర్తించాలన్న దానిపై ఒక నమూనా ప్రశ్నావళిని ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఎక్కడికక్కడ ప్రైవేట్‌ అంబులెన్స్‌ల జాబితా రూపొందించాలని, వాటిని కేంద్రీకృత కాల్‌ సెంటర్‌తో అనుసంధానించాలని, తద్వారా అంబులెన్స్‌ అందుబాటు సమయాన్ని గరిష్టంగా 20 నిమిషాలకు తగ్గించాలని పేర్కొంది. గుర్తింపు పొందిన అంబులెన్స్‌లనే కరోనా బాధితుల రవాణాకు ఉపయోగించాలని తేల్చి చెప్పింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement