సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును ఖండిస్తూ అమెరికన్ కమిటీ యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని ఆక్షేపించింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుంది. కాగా ఈ బిల్లు తప్పుడు దిశగా పయనించే ప్రమాదకర మలుపుగా అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) అభివర్ణించింది. పార్లమెంట్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందితే బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా సహా ఇతర నేతలు, అధికారులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని వ్యాఖ్యానించింది.
కాగా అమెరికన్ కమిటీ అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చుతూ మతపరమైన మైనారిటీ శరణార్ధుల కష్టాలను తొలగించడం, వారి కనీస మానవ హక్కులను గౌరవించేందుకే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేసింది. పౌరసత్వ బిల్లు, ఎన్‌ఆర్‌సీల ద్వారా ఏ ఒక్కరి పౌరసత్వానికి విఘాతం కలగదని తెలిపింది. పౌరసత్వ విధానాలను క్రమబద్ధీకరించే హక్కు అమెరికా సహా ప్రతి దేశానికీ ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment