కాంగ్రెస్ ముక్త భారత్ ప్రజా నినాదం
- దేశాన్ని తప్పుడు మార్గంలో వెళ్లనివ్వబోమన్న మోదీ
- రెండేళ్లలో 700 పథకాలు తీసుకొచ్చామన్న ప్రధాని
- నా పనితీరును బేరీజు వేయండి.. ఆశీర్వదించండి
సాక్షి, బళ్లారి: దేశాభివృద్ధిలో రాజీపడేప్రసక్తే లేదని.. దేశాన్ని తప్పుడు మార్గం పట్టనీయనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కర్ణాటకలోని దావణగెరెలో జరిగిన రెండేళ్ల విజయోత్సవ సభ ‘వికాస్ పర్వ్’లో మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 700 పథకాలను తెచ్చామని తెలిపారు. వీటిలో కొన్ని అమలు కాకపోయినా.. దేశాన్ని తప్పుడు మార్గంలో వెళ్లనీయమని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం వివిధ లాబీల ఒత్తిడికి తలొగ్గి ఎన్నో అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. తన ప్రభుత్వం ఈ రెండేళ్లలో మధ్యవర్తులను పూర్తిగా పక్కనపెట్టి రైతులు, పేదలకోసం వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ‘నేను అధికారం చేపట్టిన వారం రోజులకే నా పనితీరుపై కొందరు విమర్శలు ప్రారంభించారు.
దేశంలో కొందరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై మాత్రం కనీస నమ్మకాన్ని ఉంచరు. నేను మీలోనుంచి వచ్చిన వాడిని కనుకే వారు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని మోదీ అన్నారు. మోదీ పెద్ద పెద్ద పనులు చేయటం లేదని కొందరు తనను విమర్శిస్తున్నారంటూ.. ‘పెద్ద పనులకు యత్నించి.. నేను కూడా వారిలాగా పాపాలు చేయాలా? తప్పుడు దార్లో వెళ్లాలా? అలా జరిగే ప్రసక్తే లేదు’ అన్నారు. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల స్పష్టమైన మార్పు కనబడుతోందని.. మరింత మార్పు తీసుకువచ్చేందకు ప్రజల సహకారం కావాలని ప్రధాని కోరారు. ‘నేను మీ ముందుకు రెండు పనుల కోసం వచ్చాను.
మొదటిది రెండేళ్లలో నేను చేసిన పనిని విశ్లేషించండి. రెండోది మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి’ అని మోదీ అన్నారు. పదేళ్లు దేశాన్ని దోచుకున్న మధ్యవర్తులను తొలగిస్తున్నందుకే కాంగ్రెస్‌కు ఇబ్బంది కలుగుతోందని.. అందుకే కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని ఇచ్చామన్నారు. కానీ ప్రజలే ఈ నినాదాన్ని తలకెత్తుకుని కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తున్నారన్నారు. గతంలో ఏ ప్రధానీ చేయనట్లుగా.. అన్ని రాష్ట్రాల సీఎంలను ఢిల్లీకి పిలిపించుకుని అభివృద్ధిపై చర్చించి నిధులు కేటాయిస్తున్నానని తెలిపారు. దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునేటప్పటికి (2022 కల్లా) రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు.
రెండేళ్లలో సాధించింది సున్నా: ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: ఎన్డీఏ రెండేళ్ల పాలనపై కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేడీలు ఆదివారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఎన్డీఏ ప్రభుత్వం సామాజిక ఐక్యతను విచ్ఛిన్నం చేసిందని, సంస్థలను ఖూనీ చేసిందని, ప్రజాస్వామ్యాన్ని కుప్పకూల్చడంతో పాటు ఆర్థిక వ్యవస్థను ముంచేశారంటూ కాంగ్రె స్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ విమర్శించారు. అచ్ఛేదిన్‌లో భాగంగా వారు సాధించింది అదేనంటూ ఆరోపించారు. ధరల్ని అదుపుచేస్తామంటూ మోదీ విస్తృతంగా ప్రచారం చేసినా.. ప్రస్తుతం ఏం జరుగుతోందని ఎన్సీపీ నేత త్రిపాఠి ప్రశ్నించారు.