
న్యూఢిల్లీ : వేలమంది ప్రొ-డెమోక్రసీ నిరసనకారులు సోమవారం ఒక్కసారిగా హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొచ్చుకుపోయి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన అన్ని విమానాలను ఒకరోజు పాటు రద్దు చేస్తున్నట్లు అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ భారత ప్రయాణికులకు పలు కీలక సూచనలు చేసింది.
హాంకాంగ్ విమానాశ్రయంలో మంగళవారం కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, మరిన్ని నిరసనలు జరిగే అవకాశం ఉండడంతో విమానాల రాకపోకలు ఆలస్యం కావడం లేదా రద్దయ్యే అవకాశం ఉందని తమ ప్రకటనలో తెలిపింది. హాంకాంగ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకూ ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇప్పటికే హాంకాంగ్‌లో ఉండిపోయిన భారత ప్రయాణికులు తిరిగి సేవలు పున: ప్రారంభం అయ్యేవరకు అక్కడి అధికారులతో టచ్‌లో ఉండాలని స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి +852 90771083 హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించవచ్చని విదేశాంగ శాఖ వెల్లడించింది.