
భారత్‌కు జికా ముప్పు
ఈ ఏడాది జనవరి 4నే జికా వైరస్ గుర్తింపు
► డబ్ల్యూహెచ్‌ఓకు ఆలస్యంగా సమాచారమిచ్చిన భారత్
► దేశంలోని 20 లక్షల చ.కి.మీ. ప్రాంతం జికా వ్యాప్తికి అనుకూలం
భారత్‌కు జికా వైరస్ ముప్పు పొంచి ఉందా? దేశంలో తొలిసారిగా గుజరాత్‌లో 3 కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. మన దేశంలో జనవరిలోనే జికా వైరస్‌ను గుర్తించినా.. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ బయటకు వెల్లడించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. భారత్‌లో తొలిసారిగా జికా కేసుల్ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించాకే విషయం బయటకు తెలిసింది.
భారత్‌లో జికా వైరస్ వేగంగా వ్యాపించే అవకాశాలున్నట్లు ఏడాది క్రితమే హెచ్చరికలు వచ్చాయి. ఏప్రిల్, 2016లో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ జికా వైరస్ వ్యాప్తిపై ఒక నివేదిక విడుదల చేసింది. ఆసియాలోని 142 కోట్ల మంది ప్రజలు.. జికా వైరస్ సులువుగా వ్యాప్తి చెందే ప్రాంతాల్లో నివసిస్తున్నారని హెచ్చరించింది. ఇక భారతదేశంలోనైతే 20 లక్షల చదరపు కి.మీ. ప్రాంతం జికా వైరస్ వ్యాప్తికి అనుకూలమని పేర్కొంది. అయితే భారత ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ముప్పు ముంచుకొచ్చింది.
డబ్ల్యూహెచ్‌ఓ సమాచారం ప్రకారం.. జికా వైరస్‌ను ఈ ఏడాది జనవరి 4నే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ గుర్తించింది. భారత ప్రభుత్వం మాత్రం మే 15న డబ్ల్యూహెచ్‌ఓకు సమాచారం అందించింది. జికా 2015లో దక్షిణ అమెరికాలో వెలుగులోకి వచ్చింది. 2016లో బ్రెజిల్ తీవ్రంగా ప్రభావితమైంది. ఎల్లో ఫీవర్‌పై పరిశోధన చేస్తుండగా.. 1947లో జికా వైరస్‌ను ఉగాండాలో కనుగొన్నారు. రేసస్ కోతుల్లో దీన్ని గుర్తించారు. ఉగాండా, టాంజానియా, నైజీరియాల్లో మనుషులకు ఈ వైరస్ వ్యాపించినట్లు నిర్ధారించారు.
వ్యాప్తి ఇలా.. జికా వైరస్ వ్యాప్తికి ప్రధాన వాహకం ఎడీస్ దోమ.. డెంగ్యూను వ్యాపింపచేసే ఎడీస్ ఈజిప్టీ వల్ల కూడా సోకవచ్చు. నిల్వ ఉండే నీటిలో ఈ దోమలు ఎక్కువగా వ్యాపిస్తాయి. వైరస్ సోకిన వ్యక్తితో శారీరక కలయిక ద్వారా కూడా వ్యాపిస్తుంది.
శిశువులో మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం
వైరస్ సోకిన మహిళ గర్భం దాల్చితే పిల్లలు చిన్న తలలతో (మైక్రోసెఫాలి) పుడతారు. న్యూరాన్లు తగ్గడం, మెదడు నిర్మాణంలో కీలకమైన కణాల ఉత్పత్తి ఆగిపోవడంతో సమస్య తలెత్తుతుంది. తల్లి నుంచి సోకే ఈ వైరస్ పిండం ఎదుగుదలను అడ్డుకుంటుంది. వైరస్ ప్రభావం అధికంగా ఉంటే గర్భంలోనే శిశువులు మరణించవచ్చు. బ్రెజిల్‌లో∙4వేల మందికిపైగా చిన్నారులు మైక్రోసెఫాలితో జన్మించారు.
దోమల నివారణే మార్గం: ప్రపంచ ఆరోగ్య సంస్థ
జికాకు పూర్తి స్థాయి వైద్యం అందుబాటులో లేదు. వైరస్ వ్యాప్తికి కారణమైన దోమల్ని నిర్మూలించడమే నివారణ మార్గమని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. దోమలు గుడ్లను పెట్టే ప్రాంతాల్ని నిర్మూలించడంతోపాటు, దోమల నియంత్రణకు ఇతర ప్రత్యామ్నాయాల్ని అవలంబించాలంది. వైరస్ ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
లక్షణాలు
ఈ వైరస్ సోకినవారికి జ్వరం, తలనొప్పి, ఒంటి మీద దద్దుర్లు, కీళ్ల నొప్పులు, కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలు ఉంటాయి. కీళ్ల నొప్పులు, తలనొప్పి కొన్ని రోజుల నుంచి వారాల వరకూ ఉండవచ్చు. కొందరిలో పెద్దగా ఎలాంటి లక్షణాలు కన్పించవు. జికా బారిన పడితే గులైన్ బార్ సిండ్రోమ్ సోకే ప్రమాదముంది. ఈ సిండ్రోమ్ వస్తే వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ... శరీరంలోని కణాలపై దాడి చేస్తుంది. దీంతో కండరాలు క్షీణించి పక్షవాతం వచ్చే ప్రమాదముంది. బ్రెజిల్, బొలీవియా, కొలంబియా, పరాగ్వే, అమెరికా వర్జిన్ ఐలాండ్స్, వెనిజులా, ప్యూర్టోరికో తదితర దేశాల్లో ఈ వ్యాధి అధికంగా వ్యాపించింది.
–సాక్షి, నేషనల్ డెస్క్