
న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కు తీసుకువచ్చే ప్రక్రియను 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. విమానాలు, నౌకల ద్వారా దశలవారీగా వారిని తీసుకువస్తామని, డబ్బులు చెల్లించి ఈ సౌకర్యాన్ని పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు లేని వారినే అనుమతిస్తామని, భారత్ వచ్చాకా వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సోమవారం హోం శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షల తర్వాత 2 వారాల పాటు వారు ఆసుపత్రిలోగానీ క్వారంటైన్‌లోగానీ డబ్బులు చెల్లించి ఉండాలి. 14 రోజుల తర్వాత మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలకనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఆయా దేశాల్లోని భారతీయ ఎంబసీలు భారత్‌కు వచ్చేవారి జాబితాను రూపొందిస్తాయి. భారత్‌కొచ్చాక ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలను విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖ వెబ్‌సైట్లలో త్వరలో పొందుపరుస్తారు. మార్చి 23న అన్ని అంతర్జాతీయ ప్రయాణాలను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment