పైసా లేకుండా ప్రపంచ పర్యటనకు వెళ్లొచ్చు! | Indian Millennials Taking Loans For World Tour | Sakshi
Sakshi News home page

పైసా లేకుండా ప్రపంచ పర్యటనకు వెళ్లొచ్చు!

Published Tue, Sep 18 2018 4:58 PM | Last Updated on Tue, Sep 18 2018 5:41 PM

Indian Millennials Taking Loans For World Tour - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశ్‌ మల్హోత్ర గత జూలై, ఆగస్టు రెండు నెలలు ఇండోనేసియాలో ఒంటరిగా పర్యటించారు. కొమడో డ్రాగన్ల (రాక్షస బల్లులు)ను ప్రత్యక్షంగా వీక్షించడంతోపాటు సముద్ర గర్భంలోని అందాలను తిలకించడానికి స్కూబా డైవింగ్‌ చేశారు. మంటా రేస్‌గా ఆంగ్లంలో పిలిచే షార్క్‌ జాతికి చెందిన అతి భారీ జలచరం (8 మీటర్ల వెడల్పు దాదాపు 1400 కిలోల బరువు)తో కలిసి సముద్ర గర్భంలో ఈత కొట్టారు. అద్భుతమైన సూర్యోదయాన్ని ప్రత్యక్షంగా చూడడమే కాకుండా దాన్ని కెమెరా కన్నులో బంధించేందుకు మౌంట్‌ బాటూర్‌లోని క్రియాశీలక అగ్ని పర్వతాన్ని అధిరోహించారు. దేశ, విదేశాల్లో పర్యటించడం ద్వారా అనూహ్య అనుభవాలను, అనిర్వచనీయ అనుభూతులను పొందవచ్చని భావించే మల్హోత్ర ఈసారి ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఆయన అనుభవాలన్నీ తీపి గుర్తులే కాదు. ఆయన బాలి నగరంలో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. ఓ మాల్‌ శిథిలాలు కూలుతుంటే అందులోనుంచి అందరితోపాటు ఆయన బయటకు పరుగెత్తికొచ్చారు.

26 ఏళ్ల ఆకాశ్‌ మల్హోత్రకు ప్రపంచం తిరగడమంటే ఎంతో పిచ్చి. ఆయన గత నాలుగేళ్లలో 34 దేశాలు తిరిగొచ్చారు. రెండు నెలలు భారత్‌లో ఉంటే, నాలుగు నెలలు విదేశాల్లో తిరుగుతుంటారు. ‘డిజిటల్‌ మార్కెటింగ్‌ కన్సల్టెన్సీ’ని నడిపే ఆకాశ్‌ తన పర్యటన పిచ్చికి అనుకూలంగా తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా రోజుకు కేవలం నాలుగు గంటలే పనిచేస్తారు. మిగతా సమయమంతా పర్యటనలోనే గడుపుతారు. ఆయన భారత్‌కు వచ్చినప్పుడు మాత్రమే తన క్లైంట్లను నేరుగా కలుసుకుంటారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్లపైనే సలహాలు, సంప్రతింపులు నడుస్తాయి. ఆయన తన పర్యటన ఫొటోలను ఎప్పటికప్పుడు ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో పోస్ట్‌ చేయడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి. ఏ దేశానికి ఎంత చీప్‌గా వెళ్లవచ్చో, ఏయే ట్రావెల్‌ ప్యాకేజీలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా ఎంపిక చేసుకోవచ్చో, ఎక్కడ ఎంత చీప్‌గా ఆనందాన్ని ఆస్వాదించవచ్చో.. కిటికులన్నీ ఆకాశ్‌కు తెలుసు. ఆయన తన ‘వాండర్‌ విత్‌ స్కై’ వెబ్‌సైట్‌ ద్వారా తనలాంటి పర్యాటకులతో వీటిని షేర్‌ చేసుకుంటున్నారు. ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త టిమ్‌ ఫెర్రీస్‌ రాసిన ‘ది 4–అవర్‌ వర్క్‌ వీక్‌’ పుస్తకాన్ని చదివి తాను స్ఫూర్తి పొందానని ఆయన చెబుతున్నారు.

ఆకాశ్‌లాగా ప్రపంచ దేశాల్లో తిరగాలన్నా ఆసక్తి నేటి యువతరంలో ఎక్కువగా పెరుగుతోంది. ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో పనిచేస్తే యువతలో ఈ ఆసక్తి ఎక్కువగా ఉంటోంది.
స్కై స్కానర్‌ ఇండియా నిర్వహించిన ‘ది మిలీనియల్‌ ట్రావెల్‌ సర్వే–2017’ నివేదిక ప్రకారం 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యనున్న నేటి తరంలో 62 శాతం మంది ఏడాదికి రెండు నుంచి ఐదు సార్లు దేశ, విదేశాల్లో పర్యటిస్తున్నారు. పది శాతం మంది మాత్రం ఏడాదికి ఆరు నుంచి పది సార్లు పర్యటనలకు వెళుతున్నారు. ఇలా దేశ, విదేశీ పర్యటనలను ఇష్టపడుతున్న యువతలో స్త్రీ, పురుషులు ఆఫీసు సెలవుల్లో ఉన్న వెసలుబాటును బట్టి దగ్గరి ప్రాంతాలు, దూర ప్రాంతాల పర్యటనలను ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇక ఆకాశ్‌ లాంటి ప్రపంచ పర్యటనను పిచ్చిగా ప్రేమించే వాళ్లు ఉద్యోగాలు వదిలేసి సొంతంగా ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ పర్యటిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న టెక్కీలకు దేశ, విదేశాలు తిరిగేందుకు డబ్బులు ఎలా వస్తున్నాయన్నా సందేహం రావచ్చు. కూడబెట్టుకుంటున్న సొమ్ము సరిపోకపోతే వారంతా ట్రావెల్‌ రుణాలు తీసుకుంటున్నారు. ఇదో కొత్త ట్రెండ్‌.

వారికి ఈ రుణాలు ఇవ్వడం కోసమే ‘క్యూబెరా, ఫింజీ, ఫేర్‌సెంట్, రూబిక్యూ’ లాంటి ఆర్థిక సంస్థలు పుట్టుకొచ్చాయి. కొలాటరల్‌ గ్యారంటీ, ఈ గ్యారంటీ, ఆ గ్యారంటీ అనే తలనొప్పి షరతులు లేకుండా ఈ సంస్థలు బ్యాంకులకన్నా తక్కువ ఒడ్డీతో ట్రావెల్‌ రుణాలను అతి సులువుగా మంజూరు చేస్తున్నాయి. అయితే ఆ సంస్థలు రుణాలు మంజూరు చేస్తున్న వారిలో 80 శాతం మంది ఉద్యోగులే ఉంటున్నారు. గత రెండేళ్లలోనే ట్రావెల్‌ రుణాలు 12 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయని ఉద్యోగులకు, ఇతరులకు వ్యక్తిగత లోన్లను మాత్రమే మంజూరు చేసే సాంకేతిక సంస్థ ‘క్యూబెరా’ తెలిపింది. గతేడాది ట్రావెల్‌ రుణాలు కావాలంటూ తమ సంస్థకు దాదాపు 1700 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 728 మంది దరఖాస్తుదారులు 28 ఏళ్ల లోపు వారేనని పేర్కొంది.

తమ సంస్థ నుంచి రుణాలు కోరుతున్న ఐదు ముఖ్య కారణాల్లో ట్రావెల్‌ ఒకటని ‘క్యూబెరా’ వ్యవస్థాపకుడు అనుభవ్‌ జైన్‌ తెలిపారు. ట్రావెల్‌ రుణాల్లో రిస్క్‌ ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఉద్యోగస్థులవడం, అందులో యువకులు అవడం, పర్యటించాలనే ఉత్సాహం ఎక్కువగా ఉండడం వల్ల అంత రిస్క్‌ తమకు ఎదురు కావడం లేదని ఆయన అన్నారు. తామిచ్యే మొత్తం రుణాల్లో ట్రావెల్‌ రుణాలు గతేడాది ఐదారు శాతం ఉండగా, ఇప్పుడు 15, 16 శాతానికి చేరుకున్నాయని ఆయన వివరించారు. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తాము 12 శాతం వ్యక్తిగత రుణాలు పర్యటనల కోసం మంజూరు చేశామని ‘ఫింజీ’ సహ వ్యవస్థాపకులు, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ అభినందన్‌ సంఘమ్‌ తెలిపారు. తాము ట్రావెల్‌ రుణాలను మంజూరు చేస్తుండడం వల్ల ముందుగా ఎకానబీ క్లాస్‌ను ఎన్నుకున్న పర్యాటకులు ఆ తర్వాత లగ్జరీ క్లాస్‌కు మారుతున్నారని కూడా ఆయన చెప్పారు.

తాము కూడా ఆరు శాతం రుణాలను ట్రావెల్‌కే ఇస్తున్నామని, వీరి సంఖ్య గత రెండేళ్లుగా పెరుగుతోందని ‘ఫేర్‌సెంట్‌’ వెబ్‌ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రజత్‌ గాంధీ తెలిపారు. తాము పెళ్లిళ్లకు, హానీమూన్లకు కూడా రుణాలను మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. జేబులో పైసా లేకపోయినా ట్రావెల్‌ రుణాలను, ట్రావెల్‌ ప్యాకేజీలను సద్వినియోగం చేసుకొని ప్రపంచ దేశాల్లో పర్యటించవచ్చని ఆకాశ్‌ మల్హోత్ర సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement