అమితాబ్ టు ఐశ్వర్య.. నల్లడబ్బు గుట్టురట్టు!
జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీలో 1100 మంది భారతీయులకు రహస్య ఖాతాలు ఉన్నట్టు గత ఏడాది లీకైన స్వీస్ పత్రాలు వెల్లడించి, సంచలనం సృష్టించగా తాజాగా వెల్లడైన పనామా పత్రాలు పెనుదుమారం రేపుతున్నాయి. దాదాపు 500 మంది భారతీయుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నాయి. వారు పన్ను ఎగ్గొటి తమ నల్లడబ్బును దాచుకునేందుకు విదేశాల్లో బూటకపు కంపెనీలు, ఫౌండేషన్లు, ట్రస్టులు ఏర్పాటుచేసినట్టు వెల్లడైంది. నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్ ఫొన్సెకాకు చెందిన కోటి11 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు ఏర్పాటు చేయడంలో దిట్టగా పేరొందిన ఈ లా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. నల్లడబ్బు సర్గధామలైన దేశాల్లో కంపెనీలు స్థాపించి.. తద్వారా పన్ను ఎగ్గొట్టేందుకు ఈ కంపెనీకి పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు డబ్బు చెల్లించినట్టు ఈ పత్రాల్లో వెల్లడైంది.
ఇందులో 500 మంది భారతీయుల పేర్లు ఉండగా, 234 మంది భారతీయులు ఈ కంపెనీల ఏర్పాటు కోసం తమ పాస్‌పోర్టులను కూడా సమర్పించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఈ పత్రాలను పరిశీలించి వెల్లడించింది. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఐశ్యర్యరాయ్ తోపాటు, డీఎల్‌ఎఫ్ ప్రమోటర్ కేపీ సింగ్, ఇండియా బుల్స్ యజమాని సమీర్ గుప్తా, ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ పెద్ద సోదరుడు వినోద్ అదానీ, పశ్చిమ బెంగాల్ రాజకీయ నేత శిశిర్ బజోరా, ఢిల్లీ లోక్‌సత్తా చీఫ్ అనురాగ్ కేజ్రీవాల్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతోంది. అలాగే ముంబై గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మిర్చితోపాటు పంచుకులా, డెహ్రాడూన్, వడోదర, మంద్‌సౌర్‌కు చెందిన పలువురు పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఐశ్వర్యరాయ్.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లోని కంపెనీ
ఐశ్యర్య రాయ్, ఆమె తండ్రి రమణరాజ్ కృష్ణరాయ్, తల్లి విందాకృష్ణ రాజ్ రాయ్, సోదరుడు ఆదిత్య రాయ్ డైరెక్టర్లుగా 2005లో ఎమిక్ పార్టనర్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. మొదట ఈ కంపెనీకి ఐశ్యర్య డైరెక్టర్‌గా ఉండగా, తర్వాత షేర్ హోల్డర్‌గా మారిపోయారు. 2008లో ఈ కంపెనీ రద్దయింది.
అమితాబ్.. బహమస్ కంపెనీలు
కనీసం విదేశీ నాలుగు షిప్పింగ్ కంపెనీల్లో అమితాబ్ బచ్చన్ డైరెక్టర్‌గా ఉన్నట్టు ఈ పత్రాలు వెల్లడించాయి. ఇందులో ఒకటి బీవీఐలో ఉండగా, మరో మూడు బహమస్‌లో ఉన్నట్టు తేలింది. 1993లో స్థాపించిన ఈ కంపెనీల మూలధనం కేవలం 5వేల నుంచి 50వేల డాలర్లు కాగా, ఇవి చేసే ఓడల వ్యాపారం కోట్ల డాలర్లలో ఉండేది.