ఈ జగదేక శ్రీమంతులు నలుపా.. తెలుపా? | Breaking things Revealed ICIJ | Sakshi
Sakshi News home page

ఈ జగదేక శ్రీమంతులు నలుపా.. తెలుపా?

Published Tue, Apr 5 2016 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

ఈ జగదేక శ్రీమంతులు నలుపా.. తెలుపా?

ఈ జగదేక శ్రీమంతులు నలుపా.. తెలుపా?

సంచలన విషయాలు బయటపెట్టిన ఐసీఐజే
విదేశాల్లో ప్రముఖులకు చెందిన 2,14,000 కంపెనీల గుట్టురట్టు

 
► విదేశాల్లో ప్రముఖులకు చెందిన 2,14,000 కంపెనీల గుట్టురట్టు
► డబ్బులు దాచడానికి గుట్టల కొద్దీ పుట్టుకొచ్చిన కంపెనీలు
► ‘పనామా’లో మొస్సాక్ ఫోన్సెకా సంస్థ ద్వారా ఏర్పాటు
► యజమానుల పేర్లు రహస్యంగా ఉంచటమే ఈ సంస్థ పని
► మొస్సాక్ ఫోన్సెకాకు చెందిన 1.15 కోట్ల రహస్య పత్రాలు వెల్లడి
► జాబితాలో అమితాబ్, ఐశ్వర్యారాయ్, డీఎల్‌ఎఫ్ కేపీ సింగ్
► నాయకులు, కార్పొరేట్లు సహా 500 మంది భారతీయుల పేర్లు
► ప్రపంచవ్యాప్తంగా 140 మంది రాజకీయ నాయకులు
► రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా డజను మంది ప్రస్తుత, మాజీ దేశాధినేతలు
► అమెరికా నిషేధించిన డ్రగ్ గ్యాంగులు, టైస్టు సంస్థలదీ ఇదే తీరు
► మే తొలి వారంలో మొత్తం జాబితా బయట పెడతామన్న ఐసీఐజే
 
 పన్ను స్వర్గాల్లోని కుబేరుల గుట్టు బయటపడింది. చట్టాలకు, పన్నులకు అతీతంగా ఉండే దేశాల్లో గుట్టలకొద్దీ కంపెనీలను ఏర్పాటు చేసి డబ్బులు తరలించిన శ్రీమంతుల రహస్యాలు మరోసారి వెలుగుచూశాయి. వీరిలో ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలతోపాటు బాలీవుడ్ స్టార్లు అమితాబ్, ఐశ్వర్యారాయ్, పలువురు క్రీడాకారులు... ఒకరేమిటి!! చివరకు మాఫియా డాన్లు, దొంగలు, మాదకద్రవ్యాల స్మగ్లర్లు, అవినీతి రాజకీయ నేతలు, పన్ను ఎగవేతదారులు సైతం చాలామందే ఉన్నారు. వీళ్లే కాదు. ఉగ్రవాదం ఆరోపణలపై అమెరికా గతంలో నిషేధించిన సంస్థలు, రోగ్ దేశాలుగా పేర్కొన్న దేశాల  నేతలదీ ఇదే తీరు.

దాదాపు 120 దేశాల్లోని జర్నలిస్టులు, మీడియా సంస్థలతో కూడిన ‘కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) ఈ గుట్టు బయటపెట్టింది. ఈ కన్సార్షియంలో మన దేశం నుంచి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఉంది. దర్యాప్తులో భాగంగా 2,14,000 విదేశీ కంపెనీలకు చెందిన 2.6 టెరాబైట్ల డేటాను... 1.15 కోట్లకుపైగా పత్రాల్ని ఐసీఐజే చేజిక్కించుకుంది. వీటిలో ఈ-మెయిల్స్, పాస్‌పోర్టులు, బ్యాంకు ఖాతాలు, క్లయింట్ల రికార్డులు... చాలానే ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ పనామా కేంద్రంగా పనిచేస్తున్న న్యాయ సేవల సంస్థ ‘మొస్సాక్ ఫోన్సెకా’కు చెందినవి. వీళ్లందరి పేరిటా గుట్టలకొద్దీ రహస్య కంపెనీలు ఏర్పాటు చేసిన సంస్థ ఇదే. దాదాపు 40 ఏళ్ల పాటు.. అంటే 1977 నుంచి 2015 డిసెంబర్ వరకు ఉన్న డేటాను పరిశీలించి ఈ వివరాల్ని ఐసీఐజే బయటపెట్టింది. జాబితాలోని అందరి పేర్లనూ మే మొదటివారంలో వెల్లడిస్తామని ఐసీఐజే స్పష్టంచేసింది.

 
 పారిస్/న్యూఢిల్లీ
 దేశ, విదేశాల్లో పనామా పేపర్లు పెను సంచలనం సృష్టించాయి. రహస్య డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైన అంశాలు అనేక ప్రశ్నలను తెరపైకి తెచ్చాయి. ఇంతకీ ఆ పేపర్లు బయటపెట్టిందేంటి? ఇదేమైనా మోసమా? మనీ లాండరింగా? ఒకసారి చూద్దాం...

 మొస్సాక్ ఫోన్సెకా: ఈ కంపెనీ తమ క్లయింట్ల రహస్యాలకు కాపలాదారు లాంటిది. దీని క్లయింట్లలో మాఫియా డాన్లు, మాదకద్రవ్యాల స్మగ్లర్లు, పన్ను ఎగవేతదారులు, అవినీతి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. క్లయింట్ల విదేశీ రహస్యాలను కాపాడే ప్రపంచంలోని 5 అతిపెద్ద కంపెనీల్లో ఫోన్సెకా ఒకటి. 500 మందికిపైగా ఉద్యోగులు, సహాయకులు ఉన్న ఈ సంస్థకు... ప్రపంచవ్యాప్తంగా 40 కార్యాలయాలున్నాయి. వీటిలో స్విస్‌లో 3, చైనాలో 8 ఉండటం గమనార్హం.

 ఇదేం చేస్తుందంటే...
 పన్ను స్వర్గాల్లాంటి దేశాల్లో ఎవరైనా డబ్బులు దాచుకోవాలంటే... వారి రహస్యాలు బయట పడకుండా ఈ సంస్థ అల్లిబిల్లి కంపెనీలను సృష్టిస్తుంది. ఒకవేళ ఆయా దేశాల్లో చట్టాలు గనక మారితే... వెంటనే క్లయింట్లను అప్రమత్తం చేసి, అక్కడి సంస్థల్ని ఆగమేఘాల మీద వేరే దేశాలకు తరలిస్తుంది. అసలు యజమానుల పేరు బయటకు తెలియకుండా... వారి తరఫున ఫోన్సెకా నమోదు చేసిన కంపెనీ పేరే ఎక్కడైనా కనపడుతుంది.

ఇది తనకు చెందిన పలువురు డ మ్మీలను నామినీ డెరైక్టర్లుగా నియమిస్తుంది. దీంతో వీళ్లపేర్లే బయటకు కనిపిస్తాయి. ఇక క్లయింట్లు ఇచ్చే సొమ్మును బట్టి రకరకాల దేశాల్లో, రకరకాల కంపెనీలను ఇది సృష్టిస్తుంది. దీంతో దర్యాప్తు చేసేవారి తలప్రాణం తోకకొస్తుంది. పనామాలో ఫోన్సెకా సంస్థ క్లయింట్ల తరఫున ప్రైవేట్ ఫౌండేషన ్లను ఏర్పాటు చేస్తోంది. ఎందుకంటే పనామాలో వీటిపై పన్నులు లేవు. అక్కడి చట్టప్రకారం వీటి వ్యవస్థాపకుల, లబ్ధిదారుల పేర్లు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఇదికాక... క్లయింట్లు ఇరుక్కున్నపుడు డాక్యుమెంట్లకు వెనకటి తేదీలు వేయటంతో పాటు, ఆస్తుల్ని దాచుకోవటానికి వీలుగా క్లయింట్ల పేరిట ఫౌండేషన్లు ఏర్పాటు చేసి, వాటి లబ్ధిదారుగా తొలుత ఏదైనా స్వచ్ఛంద సంస్థను పేర్కొనటం, తరవాత లబ్ధిదారును మార్చేయటం చేస్తోంది.

 ఇదీ... ఇండియా కథ
 ప్రపంచవ్యాప్తంగా ఇలా కంపెనీలు పెట్టి, డబ్బు దాచుకున్న వారిలో 500కు పైగా భారతీయుల పేర్లూ బయటపడ్డాయి. వీరిలో బాలీవుడ్ స్టార్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు చాలామందే ఉన్నారు. అయితే ఇక్కడ అందరికీ తలెత్తే ప్రశ్న ఒక్కటే!!. వీరిలా డబ్బులు దాచుకోవటం నేరమా? విదేశాల్లో కంపెనీలు పెట్టడం తప్పా? ఇది చట్ట సమ్మతమేనా... కాదా? ఈ ప్రశ్నలకు జవాబులు చూద్దాం...

 మనదేశంలో పన్నులు చాలా ఎక్కువే. దీంతో మనవాళ్లు కొందరు విదేశాల్లో సంపాదించే డబ్బుల్ని అక్కడే ఉంచుకోవటానికి ఇష్టపడుతున్నారు. నిజానికి 2004 వరకు భారతీయులు తమ రూపాయల్ని విదేశీ కరెన్సీలోకి మార్చుకుని విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆర్‌బీఐ అనుమతించేది కాదు. అయితే కంపెనీలకు ఇవి వర్తించేవి కావు. అవి ఆర్‌బీఐ, ప్రభుత్వ అనుమతితో విదేశాల్లో కంపెనీల్ని కొనుగోలు చేసేందుకు వీలుండేది. దీంతో వ్యక్తులు విదేశాల్లో ట్రస్టులు ఏర్పాటు చేసి, పవరాఫ్ అటార్నీ తమపేరున పెట్టుకునేవారు. ఇలాంటి ట్రస్టుల్ని ఫోన్సెకాా ఏర్పాటు చేసేది.

 ఇదీ నేరం...
 ఇక్కడ గమనించాల్సిందేమిటంటే... 2004 వరకు తమ రూపాయలు విదేశీ కరెన్సీలోకి మార్చుకుని విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ వ్యక్తికీ ఆర్‌బీఐ అనుమతి లేదు. ఈ లెక్కన చూస్తే... 2004కు ముందు విదేశాల్లో తమ పేరిట ఖాతాలు తెరిచిన భారతీయులంతా చట్ట విరుద్ధంగా చేసినట్లే. అది నేరమే.

 2004లో ఆర్‌బీఐ అనుమతి...
 రిజర్వుబ్యాంకు 2004 ఫిబ్రవరిలో సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)ను ఆర్‌బీఐ ప్రకటించింది. దీనిప్రకారం ఎవరైనా ఒక ఏడాదిలో 25,000 డాలర్లు విదేశాలకు తీసుకెళ్లొచ్చు. ఆ మొత్తాన్ని మెల్లగా పెంచగా ఇపుడది 2.5 లక్షల డాలర్లకు చేరింది. దీన్ని వైద్య ఖర్చులు, విరాళాలు, కాలేజీ ఫీజు, షేర్ల క్రయవిక్రయాలకు వినియోగించవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. దేనికి వాడకూడదో మాత్రం చెప్పలేదు. షేర్లు కొనొచ్చని ఉంది కదా అనే సాకుతో... కొందరు వ్యక్తులు ‘పేపర్’ కంపెనీల్లో షేర్లను కొన్నారు. ఈ పేపర్ కంపెనీల్నే పెట్టుబడి గొట్టాలుగా మార్చారు. పేపర్ కంపెనీల్లో షేర్లను అమ్మటం ఫోన్సెకా పని.

 2010లో మళ్లీ ఆర్‌బీఐ సవరణలు...
 రెమిటెన్స్ స్కీము దుర్వినియోగమవుతోందని భావించిన ఆర్‌బీఐ 2010లో వివరణిచ్చింది. భారతీయులు వ్యక్తిగతంగా విదేశాల్లో కంపెనీలను ఏర్పాటు చేయకూడదని తేల్చింది. కానీ నిపుణులు దీనికో భాష్యం చెప్పారు. ‘‘కంపెనీలు ఏర్పాటు చేయొద్దన్నారు గానీ... కంపెనీల్ని టేకోవర్ చెయ్యకూడదనలేదుగా?’’ అని లొసుగు వెతికారు. దీంతో షెల్ కంపెనీల్ని ఏర్పాటు చేసి వాటిని విక్రయించటం మొదలెట్టింది ఫోన్సెకా.
 
 2013లో మరోసారి సవరణ...
 దేశంలో ఉన్న సంస్థలకు నూరుశాతం అనుబంధ సంస్థలైతే విదే శాల్లో ఏర్పాటు చేసుకోవచ్చంటూ 2013లో ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఓడీఐ) ద్వారా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవచ్చని కూడా తెలిపింది. దీంతో సాంకేతికంగా... 2013కన్నా ముందు భారతీయులు విదేశాల్లో ఏర్పాటు చేసిన కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించినట్లేనని ఐసీఐజే చెబుతోంది.
 
 ఐసీఐజే అంటే...
 ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు(ఐసీఐజే)లో 60 దేశాలకు చెందిన 160 మంది రిపోర్టర్లు ఉన్నారు. వీరు పరిశోధనాత్మక కథనాల కోసం పనిచేస్తున్నారు. దీన్ని 1997లో ఏర్పాటు చేశారు. ఖండాతర నేరాలు, అవినీతి వ్యవహారాలు, స్కాంలు వెలికితీస్తూ ‘వాచ్‌డాగ్’ జర్నలిజాన్ని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వార్తా సంస్థలతో కలిసి పనిచేస్తోంది.
 
 ఇలా చేస్తే మోసం చేసినట్టే
 ► 2004 కన్నా ముందు వ్యక్తులు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసినా నేరమే.
 ► 2013కన్నా ముందు వ్యక్తులు విదేశాల్లో కంపెనీలు పెట్టినా నేరమే.
 ► మరో కీలకమైన అంశమేంటంటే ‘వెల్లడి ఒప్పందం’. వ్యక్తులు గనక ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి చెప్పి.. దాని ప్రకారం ఇన్వెస్ట్ చేసి ఉంటే పెద్ద ఇబ్బందులుండవు. కానీ వీరెవరికీ విదేశాల్లోని తమ ఆస్తుల గురించి చెప్పకుండా ఉంటే మాత్రం... మనీలాండరింగ్, ఫెమా వంటి రకరకాల కేసులు వర్తిస్తాయి.
 ► విదేశాల్లో సంపాదించిన డబ్బును కూడా భారతీయులు అధికారులకు తెలియజేయాలి. వాటిని గనక ఫోన్సెకా ద్వారా అక్కడే వివిధ కంపెనీల్లో దాచి ఉంటే... పన్నులు ఎగవేసినట్టే. వారిని ప్రాసిక్యూట్ చేసే అవకాశముంటుంది. అందుకని మున్ముందు బయటపడాల్సిన అంశం ఇదే.
 
 ఇదో చిత్రమైన మెయిల్
 ఫోన్సెకా కంపెనీ అధికారి నుంచి అమెరికా బిలియనీర్‌కు అందిన ఈ-మెయిల్‌ను ఐసీఐజే బయటపెట్టింది. దీన్లో... బ్యాంకును ఎలా మోసగిస్తారో సమగ్రంగా వివరించారు. ఖాతాదారుడికి బదులు వేరే వ్యక్తుల్ని బ్యాంకులకు పరిచయం చేస్తామని... అందువల్ల అసలు వ్యక్తి పేరు బయటకు రాదని, ఫీజు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. నిజానికి ఈ కంపెనీ క్లయింట్‌కు కావాల్సిన సేవల్ని బట్టి ఫీజులు వసూలు చేస్తోంది.

 ఫొన్సెకాలో కంపెనీ తెరిచేందుకు కావాల్సిన పత్రాలు
 1. పాస్‌పోర్ట్ ఫొటోకాపీ
 2. బ్యాంకు రిఫరెన్స్ ఉత్తరం
 3. ఫ్రొఫెషనల్ రిఫరెన్స్ ఉత్తరం
 4. ఏదైనా నెలవారీ వినియోగదారుల స్టేట్‌మెంట్
 
 దర్యాప్తు బృందం ఏర్పాటు
 భారత్‌కు చెందిన 500 మంది విదేశాల్లో సొమ్ము దాచుకున్నట్లు పనామా పేపర్స్ ద్వారా వె ల్లడి కావడంతో దీనిపై కేంద్రం స్పందించింది. ఇందులో వెలుగుచూసిన అంశాలను పరిశీలించి దర్యాప్తు చేసేందుకు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం వెల్లడించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ తనతో చర్చించారని, ఆయన సూచన మేరకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సీబీడీటీ, ఆర్‌బీఐ, ఎఫ్‌ఐయూ(ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్) విభాగాల ఉన్నతాధికారులతో ఈ బృందం ఏర్పాటైంది. ఈ వివరాల ఆధారంగా తాము కూడా దర్యాప్తు చేపడతామని నల్లధనంపై ఏర్పాటైన సిట్ వెల్లడించింది.
 
 మా దేశంపై దాడి: మొసాక్ ఫోన్సెకా
 తమ సంస్థకు చెందిన రహస్య పత్రాలను వెల్లడించడంపై పనామాలోని మొసాక్ ఫొన్సెకా మండిపడింది. ‘‘ఇది నేరం. మోసం. మా దేశంపై దాడి. మా దేశం అనేక కంపెనీలను ఆకర్షించడం జీర్ణించుకోలేని కొన్ని దేశాలు కుట్రతో ఇదంతా చేశాయి’’ అని ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు రామన్ ఫొన్సెకా అన్నారు. హ్యాకింగ్ చేసి అక్రమంగా డాక్యుమెంట్లు సంపాదించారని ఆరోపించారు. లీకైన పత్రాల్లో చాలావరకు నిజమైనవేనన్నారు. 40 ఏళ్ల నుంచి కంపెనీ నడుపుతున్నామని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. బ్యాంకుల్ని మోసగించడానికి ఎలాంటి సేవలు అందించలేదని తెలిపారు.
 
 మన దేశంలో ఎవరెవరు?

 ఐశ్వర్యారాయ్
 ఐశ్వర్యారాయ్, ఆమె తల్లిదండ్రులు బృందా కృష్ణరాజ్ రాయ్, కృష్ణరాజ్, సోదరుడు ఆదిత్య రాయ్ డెరైక్టర్లుగా 2005లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని ఓ కంపెనీ ఏర్పాటైంది. దాని పేరు ఆమిక్ పార్టనర్స్ లిమిటెడ్. 2008లో ఆ కంపెనీ మూతపడే వరకు ఐశ్వర్యారాయ్ ఆ కంపెనీ షేర్‌హోల్డర్‌గా ఉన్నారు
 
 అమితాబ్ బచ్చన్
 బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌తోపాటు బహమాస్‌లో 1993లో ఏర్పాటు చేసిన నాలుగు షిప్పింగ్ కంపెనీలకు డెరైక్టర్‌గా పనిచేశారు. ఈ కంపెనీల ద్వారా మిలియన్ డాలర్ల వ్యాపారం చేశారు.
 
 కేపీ సింగ్
 ప్రముఖ భవన నిర్మాణాల సంస్థ డీఎల్‌ఎఫ్ ప్రమోటర్ ఈయన. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో 2010లో నమోదైన ఓ కంపెనీని తన భార్య ఇందిరాసింగ్‌తో కలిసి కొనుగోలు చేశారు. ఈయన తనయుడు రాజీవ్‌సింగ్, కూతురు పియాసింగ్ పేరిట 2012లో మరో రెండు కంపెనీలు నెలకొల్పారు. వీటి విలువ సుమారు కోటి డాలర్లు ఉంటుందని అంచనా.
 
గర్వారే కుటుంబం
 వ్యాపార దిగ్గజం గర్వారే కుటుంబానికి చెందిన అశోక్, ఆయన కుమారుడు ఆదిత్య, భార్య సుష్మ గర్వారేలకు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లో ఏర్పాటైన రాండార్ ఓవర్సీస్ సహా పలు విదేశీ సంస్థల్లో వాటాలున్నాయి. 1996 మేలో రాండార్ ఏర్పాటైంది. ఆదిత్య, సుష్మలకు పలు పనామా సంస్థల్లో పవర్ ఆఫ్ అటార్నీలున్నాయి. 10,000 డాలర్ల ఆస్తులతో గర్వారేలు 2010లో ఫుజియామా టీమ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇంకా పలు పనామా సంస్థల్లో ఆదిత్య, సుష్మలకు పవర్ ఆఫ్ అటార్నీలు ఉన్నాయి. వీటిలో చాలా మటుకు సంస్థలు 2014లో మూతపడ్డాయి. విదేశీ మిత్రులతో కలిసి ఏర్పాటు చేసిన కొన్ని సంస్థల ప్రధానోద్దేశం భారత్‌లో పెట్టుబడులు పెట్టడమేనని, అది నెరవేరకపోవడంతో చాలా మటుకు సంస్థలు మూతబడ్డాయని, వీటితో గర్వారే కుటుంబసభ్యులకు ఎటువంటి ప్రమేయమూ లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి.
 
 ఇండియా బుల్స్
 దేశీ రియల్టీ దిగ్గజాల్లో ఒకైటె న ఈ సంస్థ సమీర్ గెహ్లాట్, ఆయన సోదరుడు నాగేంద్ర, తండ్రి బల్వాన్ సింగ్‌ల సారథ్యంలో ఉంది. 2012లో కుటుంబ ఆస్తుల నిర్వహణ కోసం ఎస్‌జీ ఫ్యామిలీ ట్రస్ట్ ఏర్పాటైంది. దీనికి పర్‌పెచ్యువల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ సంస్థ ట్రస్టీగా ఉంది. ఎస్‌జీ ట్రస్టు ఆధ్వర్యంలోని క్యాలేయిస్ ఇన్‌ఫ్రాకు క్లైవ్‌డేల్ ఓవర్సీస్ అనే అనుబంధ సంస్థ ఉంది. ఈ క్లైవ్‌డేల్‌కు బహమాస్, మారిషస్, బ్రిటన్ దేశాల్లో పలు అనుబంధ సంస్థలున్నాయి. ఈ సంస్థల్లో చాలా వాటి గురించి నియంత్రణ సంస్థలకు ట్రస్ట్ వెల్లడించినప్పటికీ.. బ్రిటన్ లావాదేవీల గురించి మాత్రం వెల్లడించలేదు. క్లైవ్‌డైల్‌కు లండన్‌లో మూడు ప్రాపర్టీలున్నాయి. వీటిలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతోంది.
 
 శిశిర్ కె బజోరియా
 ఆరు దేశాల్లో ఉక్కు రిఫ్రాక్టరీ యూనిట్లున్న ఎస్‌కే బజోరియా గ్రూప్ ప్రమోటరు. ఈయన కోల్‌కతాకి చెందిన పాత తరం వ్యాపార కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)కి చెందిన హాప్టిక్ (బీవీఐ) సంస్థ యజమానిగా ఫస్ట్ నేమ్స్ గ్రూప్, బజోరియా పేర్లున్నాయి. దీని ఆస్తులు మిలియన్ డాలర్ల పైగా ఉన్నాయి. తమ కుటుంబం ఫస్ట్ నేమ్స్ గ్రూప్‌కి క్లయింట్లు మాత్రమేనని, హాప్టిక్‌తో ఎటువంటి సంబంధం లేదని శిశిర్ ప్రకటించారు.
 
 ఓంకార్ కన్వర్
 టైర్ల తయారీలో ఉన్న అపోలో గ్రూప్ చైర్మన్. కన్వర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు బీవీఐలో జేఅండ్‌ఎస్ సిస్టమ్స్ కార్పొరేషన్‌ను, రెండు ట్రస్టులను ఏర్పాటు చేశారు. జేఅండ్‌ఎస్‌కు మెర్కామ్ ఆయిల్ శాండ్స్‌లో మిలియన్ షేర్లతో పాటు బార్‌క్లేస్ బ్యాంక్, కేమాన్ నేషనల్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ కంపెనీలో ఖాతాలు ఉన్నాయి. 2014 నవంబర్ 30 నాటికి కేమాన్ ఖాతాలో 3,65,478 పౌండ్ల బ్యాలెన్స్ ఉంది. కన్వర్ కుటుంబం భారత చట్టాలకు అనుగుణంగానే విదేశీ పెట్టుబడులు పెట్టిందని అపోలో టైర్స్ వివరణ ఇచ్చింది.
 
 హరీశ్ సాల్వే
 ప్రముఖ లాయరు. 1999-2002 మధ్య సొలిసిటర్ జనరల్‌గా కూడా వ్యవహరించారు. సాల్వే కుటుంబం బీవీఐలో క్రెస్ట్‌బ్రైట్, పెబుష్ గ్రూప్, ఎడెన్‌వాల్ సంస్థలను ఏర్పాటు చేసింది. బ్రిటన్‌లో తన పెట్టుబడుల నిర్వహణ కోసం చట్టబద్ధంగా 2012లో క్రెస్ట్‌బ్రైట్‌ను ఏర్పాటు చేసినట్లు, ప్రస్తుతం ఏ కంపెనీకి ఆస్తులు, ఆదాయం లేవని సాల్వే పేర్కొన్నారు.
 
 జహంగీర్ ఎస్ సొరాబ్జీ
 మాజీ టార్నీ జనరల్ సోలి సొరాబ్జీ తనయుడు, బోంబే హాస్పిటల్‌లో గౌరవ కన్సల్టెంటు. బీవీఐలో 2010 నవంబర్‌లో ఏర్పాటైన మూన్‌గ్లో ఇన్‌వెస్ట్‌మెంట్స్ గ్లోబల్‌లో ఏకైక షేర్‌హోల్డరు. ఆర్‌బీఐ స్కీము ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్‌మెంటు కోసం పంపిన నిధులను కంపెనీ అందుకుందని, తన ఐటీ రిటర్నుల్లో కూడా వివరాలన్నీ పొందుపర్చడం జరిగిందని జహంగీర్ తెలిపారు.
 
 మోహన్‌లాల్ లోహియా
 ఇండో రమా సింథటిక్స్ గౌరవ చైర్మన్. 2007లో బీవీఐలో రిజిస్టరయిన వెంటన్ గ్రూప్‌కు ఫస్ట్ డెరైక్టర్ కూడా. సహజసిద్ధంగా ఇది మూతబడేలా వదిలేయాలని 2012లో ఫోన్సెకాకు ఈమెయిల్ ద్వారా సందేశం పంపారు. 2010లో లోహియా చారిటబుల్ ఫౌండేషన్‌ను 10,000 డాలర్ల కార్పస్‌తో ఏర్పాటు చేశారు.
 
 జవారే పూనావాలా
 కోటీశ్వరుడు సైరస్ పూనావాలా సోదరుడైన జవారే.. రాయల్ వెస్టర్న్ ఇండియా టర్ఫ్ క్లబ్ మేనేజింగ్ కమిటీకి సారథి. రియల్టీ, ఆతిథ్య తదితర రంగాలకు చెందిన నాలుగు సంస్థల బోర్డుల్లో ఉన్నారు. 2013లో బీవీఐలో ఏర్పాటైన స్టాలాస్ట్‌లో జవారే, ఆయన భార్య బెహ్రోజ్, ఇద్దరు కుమార్తెలు డెరైక్టర్లుగా ఉన్నారు.
 
 ఇందిరా శివశైలం, మల్లికా శ్రీనివాసన్
 అమాల్గమేషన్స్ గ్రూప్ చైర్మన్ అనంతరామకృష్ణన్ శివశైలం సతీమణి అయిన ఇందిర 2008లో కన్ను మూశారు. ప్రస్తుతం టాఫే చైర్మన్‌గా ఉన్న మల్లికా శ్రీనివాసన్ ఈమె కుమార్తె. 1999లో బీవీఐలో ఏర్పాటైన స్టాన్‌బ్రిడ్జ్ కంపెనీ షేర్‌హోల్డరుగా ఇందిర పేరుంది. తర్వాత ఆ వాటాలు కుమార్తెలకు అందాయి. స్టాన్‌బ్రిడ్జ్‌కి తనకు ఎటువంటి సంబంధం లేదని మల్లికా శ్రీనివాసన్ వివరణిచ్చారు.
 
 అబ్దుల్ రషీద్ మీర్
 కాటేజ్ ఇండస్ట్రీస్ ఎక్స్‌పొజిషన్ (సీఐఈ) వ్యవస్థాపకుడు, సీఈవో. పనామాలో 2002లో మాండేల్ ఎస్‌ఏను 10,000 డాలర్ల అథీకృత మూలధనంతో ఆయన ప్రారంభించారు.  కంపెనీలో వాటాలను మీర్ కుమారుడు ముజీబ్‌కు దఖలుపర్చడం జరిగింది. ముజీబ్ 2005లో హత్యకు గురికావడంతో రషీద్ మీర్, తబసుమ్ మీర్‌లు మాండేల్ ఎస్‌ఏ అదనపు డెరైక్టర్లుగా నియమితులయ్యారు. తబసుమ్ మీర్ 17 భారత కంపెనీల్లో డెరైక్టరుగా ఉన్నారు. ముజీబ్ మరణానంతరం ట్రస్టును మూసివేసి, వచ్చిన వాటిని కుటుంబ సభ్యులకు పంచేయడం జరిగిందని, భారత ప్రభుత్వానికీ వివరాలు సమర్పించామని తబసుమ్ పేర్కొన్నారు.
 
 ప్రపంచ నేతల్లో ఎవరెవరంటే..
 50 దేశాల్లోని సుమారు 140 మంది రాజకీయ నేతలు విదేశాల్లో కంపెనీలు పెట్టి పెద్దఎత్తున సొమ్మును పోగేసుకున్నారు. వారిలో 12 మంది ప్రస్తుత, మాజీ దేశాధ్యక్షులతోపాటు ప్రముఖ సినీనటుడు జాకీచాన్ వంటి వారున్నారు. వారిలో ముఖ్యుల వివరాలివీ..
 
 వ్లాదిమిర్ పుతిన్ (రష్యా అధ్యక్షుడు)
 ఈయన నేరుగా కంపెనీలు ఏర్పాటు చేయకపోయిన తన సన్నిహితుల ద్వారా ఇబ్బడిముబ్బడిగా నెలకొల్పారు. ఇలా అనేక దేశాల్లో ఏర్పాటైన కంపెనీల విలువ 200 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా.
 
  జిన్‌పింగ్ (చైనా అధ్యక్షుడు)
 వర్జిన్ ఐలాండ్స్‌లో ఈయన బావమర్ది పేరిట 2 కంపెనీల్లో పెద్దఎత్తున షేర్లున్నాయి.
 
 సిగ్మున్‌దుర్ డేవిడ్ గన్లాగ్సన్ (ఐస్‌ల్యాండ్ ప్రధాని)

 విదేశాల్లో భార్య పేరిట అనేక కంపెనీలు ఏర్పాటు చేశారు. పెట్టుబడుల కోసం అందులో పెద్దఎత్తున సొమ్ము దాచారు.
 
 పీట్రో పొరోషెంకో (ఉక్రెయిన్ అధ్యక్షుడు)

 విదేశాల్లో పలు కంపెనీల్లో మెజారిటీ వాటాలు కలిగి ఉన్నారు. వీటి విలువ కోట్లలో ఉంటుంది.
 
 నవాజ్ షరీఫ్ (పాక్ ప్రధాని)
 తన కుటుంబీకుల పేరిట బ్రిటన్‌లో పలు కంపెనీలు, ఆస్తులున్నాయి
 
 డేవిడ్ కామెరూన్ (బ్రిటన్ ప్రధాని)
 కామెరాన్ తండ్రి పనామాలో ఓ కంపెనీ ఏర్పాటు చేశారు. పన్నులు ఎగ్గొటేందుకు అనేక మార్గాలు చూపిచండం ఈ కంపెనీ ప్రత్యేకత.
 
 మాక్రి (అర్జెంటీనా అధ్యక్షుడు)
 ఈయన తండ్రి, సోదరుడు విదేశాల్లో అనేక కంపెనీలు నడుపుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement