
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. ప్రభుత్వాల చొరవతో కరోనా మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 2.5 శాతం దిగువకు పడిపోయిందని తెలిపింది.కంటెయిన్మెంట్ వ్యూహాలను సమర్థంగా అమలు చేయడం, పెద్దసంఖ్యలో టెస్టులు నిర్వహించడం, మెరుగైన చికిత్సా విధానాలతో దేశంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. భారత్‌లో కరోనా మరణాల రేటు క్రమంగా దిగివస్తూ ప్రస్తుతం 2.49 శాతానికి పడిపోయిందని, ఇది ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేట్లలో ఒకటని తెలిపింది.
పలు రాష్ట్రాలు వ్యాధి సోకే ముప్పున్న వృద్ధులు, గర్భిణులు, ఇతర వ్యాధులు కలిగిన వారిని గుర్తించేందుకు సర్వేలు నిర్వహించాయని కరోనా కట్టడికి ఇది ఉపకరించిందని పేర్కొంది. రిస్క్ అధికంగా ఉన్న వ్యక్తులపై నిరంతర పరిశీలనతో పాటు వ్యాధిని ముందే గుర్తించగలిగి చికిత్స అందించడంతో మరణాల రేటు తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా, బ్రెజిల్, రష్యా, పెరూ, చిలీ, మెక్సికో, దక్షిణాప్రికా, బ్రిటన్, పాకిసాఓ‍్తన్, స్పెయిన్ వంటి దేశాలు కలిపి భారత్‌లో కోవిడ్ 19 కేసుల కంటే 8 రెట్లు అధికంగా కేసులు నమోదు చేశాయని వెల్లడించింది. భారత్‌లో మరణాల రేటు కంటే ఈ దేశాల్లో మరణాల రేటు 14 రెట్లు అధికమమని పేర్కొంది.
చదవండి : కరోనాతో కన్నడ నటుడు మృతి
కరోనా కట్టడికి క్షేత్రస్ధాయిలో ఆశాలు, ఏఎన్‌ఎంలు వంటి ఆరోగ్య సిబ్బంది అహరహం శ్రమించారని దీంతో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో భారత్‌లో 38,902 కోవిడ్-19 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618కి చేరుకోగా 6,77,422 మంది కోలుకున్నారు. ఇక ఈ వ్యాధితో తాజాగా 543 మంది మరణించారు. తాజా మరణాలతో దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 26,816కు ఎగబాకింది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 23,672 మంది కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment