సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా మహమ్మారి బారినుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పుంజుకోవడం ఊరట కలిగిస్తోంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య దాదాపు 17 లక్షలకు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రికవరీ రేటు 70.77 శాతానికి పెరిగిందని పేర్కొంది. దేశంలో కోవిడ్-19 మరణాల రేటు మరింత తగ్గి 1.96 శాతంగా నమోదైందని తెలిపింది. భారీగా రికవరీలు చోటుచేసుకుంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 27.27 శాతం కేసులే యాక్టివ్‌గా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
యాక్టివ్ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య 10 లక్షలకు పైగా అధికమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇక గడిచిన 24 గంటల్లో 56,383 మంది వైరస్ నుంచి కోలుకున్నారని, రికవరీల సంఖ్య 16,95,982కు చేరిందని గణాంకాలు పేర్కొన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,53,622 యాక్టివ్ కేసులున్నాయి. ఈనెల 12 వరకూ 2,68,45,688 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎంఆర్ పేర్కొంది. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 8,30,391 కరోనా టెస్టులు జరిగాయని తెలిపింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 66,999 తాజా పాజిటివ్ కేసులతో భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,637కు చేరింది. మహమ్మారితో ఒక్క రోజులోనే 942 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. చదవండి : నిల్వ చేసిన కోడి రెక్కల్లో కరోనా: చైనా
Comments
Please login to add a commentAdd a comment