గువహటి : ఏళ్ల తరబడి నిర్మాణ దశలోనే మగ్గిన దేశంలోనే అతిపెద్ద వంతెన ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ 21 ఏళ్ల క్రితం శంకుస్ధాపన చేసిన బోగిబీల్ రోడ్డు కం రైలు వంతెన పూర్తయి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంగళవారం జాతికి అంకితం కానుంది. 2002లో ఈ ప్రాజెక్టు పనులను అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ప్రారంభించారు. 4.94 కిమీ పొడవున్న ఈ వంతెన అసోంలోని టిన్సుకియా అరుణాల్‌ప్రదేవ్‌లోని నహర్లగన్‌లను కలుపుతుంది.
ఈ రూట్‌లో రెండు పట్టణాలను కలుపుతూ టిన్సుకియా-నహర్లగన్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రధాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈశాన్య ప్రాంత పురోభివృద్ధికి ఈ వంతెన కీలకం కానుందని అధికారులు చెబుతున్నారు.బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే ఈ డబుల్‌డెక్కర్ రైల్ రోడ్డు బ్రిడ్జి కోసం గత రెండు దశాబ్ధాలుగా అసోం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు వేచిచూస్తున్నారు. ఈ వంతెనపై నడిచే రైలుతో ఇరు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం పదిగంటలకు పైగా తగ్గనుంది.
ఇంజనీరింగ్ అద్భుతంగా కొనియాడుతున్న ఈ వంతెన ఈశాన్య సరిహద్దు రక్షణ మౌలిక వసతులకూ ఉపకరించనుంది. బ్రహ్మపుత్ర నదిపై వంతెన నిర్మాణం అతిపెద్ద సవాల్‌తో కూడుకున్నది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంతో పాటు సిస్మిక్ జోన్‌లో ఈ భూభాగం ఉండటం వంటి అవరోధాలను అధిగమించి దేశంలోనే అతిపెద్దదైన వంతెనను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఈశాన్య రైల్వేల సీపీఆర్‌ఓ ప్రణవ్ జ్యోతి శర్మ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment