148 శాతం పెరిగిన విద్యార్థుల ఆందోళన
న్యూఢిల్లీ: అడగంది అమ్మయిన అన్నం పెట్టదన్నట్లుగా ఈ దేశంలో ఆందోళన చేయంది ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్యా తీరదు. దేశంలో ఆందోళనలను రాజకీయ, ఆర్థిక, సామాజిక, కార్మిక, విద్యార్థుల ఆందోళనలంటూ పలు రకాలుగా విభజించవచ్చు. 2009 నుంచి 20014 వరకు ఆందోళనలకు సంబంధించిన డేటాను విశ్లేషించగా ఈ ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 4,20,000 ఆందోళనలు చోటుచేసుకున్నాయి. అంటే రోజుకు సరాసరి సగటున 200 ఆందోళనలు జరిగాయి.
ఈ ఆందోళనలు అంతకుముందు ఐదేళ్ల కాలంతో పోలిస్తే 55 శాతం పెరిగాయి. అన్నింటికన్నా ఎక్కువ పెరిగింది విద్యార్థుల ఆందోళనలు. ఏకంగా 148 శాతం పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా కాలేజీ యూనియన్లపై నిషేధం ఉన్నప్పటికీ కర్ణాటక రాష్ట్రంలోనే విద్యార్థుల ఆందోళనలు ఎక్కువగా చోటుచేసుకోవడం విశేషం. అక్షరాస్యత ఎక్కువగా ఉండడంతోపాటు విద్యాలయాలు కూడా ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. జాతీయ అక్షరాస్యత సరాసరి సగటు 74 శాతం కాగా, కర్నాటకలో 75.6శాతం ఉంది. దేశంలో ఏ నగరంలో లేనివిధంగా ఒక్క బెంగళూరు నగరంలోనే 911 కాలేజీలు ఉన్నాయి.
ఆందోళనల్లో తమిళనాడు ఫస్ట్....
ఈ ఐదేళ్లకాలంలో విద్యార్థుల ఆందోళనలతోపాటు మతపరమైన ఆందోళనలు 92 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు 71 శాతం, రాజకీయ ఆందోళనలు 42 శాతం, కార్మికుల ఆందోళలు 38 శాతం పెరిగాయి. అన్ని రకాల ఆందోళనల్లో 50 శాతం ఆందోళనలు తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్టలోనే జరిగాయి. తమిళనాడు మొదటి స్థానంలో, పంజాబ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలు అక్షరాస్యతలో ముందున్న రాష్ట్రాలే. మొత్తం ఆందోళనల్లో 25 శాతం ఆందోళనలు తమిళనాడులోనే చోటు చేసుకున్నాయి. స్వాతంత్య్రానికి ముందు నుంచి కూడా తమిళనాడులోనే ఆందోళనలు ఎక్కువ. హిందీ భాషా వ్యతిరేక ఆందోళనలు, ఎల్టీటీఈగా మద్దతుగా ఆందోళనలు, ఆ తర్వాత కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్కు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగడమే దీనికి కారణం.
దేశ రాజధాని ఢిల్లీలో....
మొత్తం ఆందోళనల్లో దేశరాజధాని ఢిల్లీ ఏడవ స్థానంలో నిలిచింది. పరిగణలోకి తీసుకొన్న ఐదేళ్ల కాలంలో నగరంలో మొత్తం 23,000 ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనలకు జంతర్ మంతర్, రామ్లీలా మైదాన్, ఇండియా గేట్ ప్రధాన వేదికలయ్యాయి. అన్న హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఆందోళన, నిర్భయ రేప్ కేసులో ఆందోళనలు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్తో మాజీ సైనికులు చేపట్టిన ఆందోళనలు ముఖ్యమైనవి.
యూపీ, బీహార్లో ఒక శాతం మాత్రమే....
దేశంలోని జనాభాలో 25 జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్లో ఒక్క శాతానికి తక్కువగా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈరెండు రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువ. దేశంలోనే బీహార్ రాష్ట్రంలో అత్యల్పం. మొత్తం ఆందోళనల్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో అక్షరాస్యత 67 శాతం. రాష్ట్ర విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగానే ఎక్కువ ఆందోళనలు చేసుకున్నాయి. కేరళ, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ ఆందోళనలు చోటు చేసుకోక పోవడానికి, అక్షరాస్యతకు ప్రత్యక్ష సంబంధం లేకపోవడానికి ఇతర కారణాలున్నాయి. కేరళలో బంద్లను, ఆందోళనలకు ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధించడం, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక సాయుధ బలగాల చట్టం అమల్లో ఉండడం లాంటివి అందుకు కారణం కావచ్చు.
(బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ డాక్యుమెంట్ల ఆధారంగా చేసిన విశ్లేషణ)