
ఎమర్జెన్సీ విధింపు దుస్సాహసం: ప్రణబ్
నాటి పరిస్థితులపై పుస్తకంలో రాష్ట్రపతి
ఇందిర చర్య నివారించదగ్గది
ఆమె భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది
న్యూఢిల్లీ: దేశంలో 1975-77 మధ్య నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని అప్పటి ఇందిర కేబినెట్‌లో సహాయ మంత్రి, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తప్పుబట్టారు. ఈ చర్యను దుస్సాహసంగా, నివారించదగ్గ సంఘటనగా ప్రణబ్ అభివర్ణించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజల ప్రాథమిక హక్కులు, ఎన్నికలు రద్దు కావడం, మూకుమ్మడి అరెస్టులు, మీడియాపై నిషేధం వంటి చర్యలు ప్రజలను తీవ్రంగా వేధించాయన్నారు. ఇందుకుగానూ తర్వాతి కాలంలో ఇందిర భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో చీకటి పాలనగా సాగిన ఎమర్జెన్సీపై రాష్ట్రపతి తన మనోభావాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘ద డ్రమాటిక్ డికేడ్: ద ఇందిరా గాంధీ ఇయర్స్’ పేరిట రాసిన ఈ పుస్తకం గురువారం ప్రణబ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. 321 పేజీల ఈ పుస్తకంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, నాటి ప్రతిపక్ష నేత జయప్రకాశ్ నారాయణ్ ఎదురుదాడి వైఖరి, 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, కాంగ్రెస్‌లో చీలిక, 1980లో పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం వంటి పరిణామాలను ప్రణబ్ ప్రస్తావించారు.
సూచన మేరకే విధింపు...
నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన సిద్ధార్థ శంకర్ రే సూచన మేరకే ఇందిర 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారని ప్రణబ్ పేర్కొన్నారు. దేశంలో అంతర్గత అల్లర్లను కారణంగా చూపుతూ ఎమర్జెన్సీ ప్రకటించేందుకు వీలు కల్పించే రాజ్యాంగ నిబంధనల గురించి సైతం ఇందిరకు తెలియవ న్నారు. కానీ ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఆకృత్యాలపై విచారణకు 1977లో ఏర్పాటైన షా కమిషన్ ఎదుట రే సహా ఇతర మంత్రులు, ఉన్నాతాధికారులంతా ఆ నెపాన్ని ఇందిరపై మోపారని ప్రణబ్ గుర్తుచేసుకున్నారు. అలాగే షా కమిషన్ ఎదుట నాటి కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రణబ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందిర ఆదేశాల ప్రకారం ఎమర్జెన్సీ విధింపు కోరుతూ బ్రహ్మానందరెడ్డి నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌కు తెల్ల కాగితంపైనే సంతకం చేశారని ప్రణబ్ పేర్కొన్నారు.
79వ ఏట అడుగిడిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం 79వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, త్రివిధ దళాల అధిపతులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులు, వికలాంగ చిన్నారులతో కలసి ప్రణబ్ వేర్వేరుగా కేక్ కట్ చేశారు. మరోవైపు రాష్ట్రపతి భవన్‌లోని 113 అరుదైన చిత్రాలను ప్రజల కోసం రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్క క్లిక్‌తో రాష్ట్రపతి భవన్‌లోని వింతలు, చారిత్రక విశేషాలను సామాన్య ప్రజలు తెలుసుకునేలా ఈ అవకాశం కల్పించారు. అలాగే రాష్ట్రపతి భవన్‌లో నివసించే 60 ఏళ్ల వయసు దాటిన వారికి హెల్త్‌కార్డులను పంపిణీ చేశారు.