ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హయాంలో 1975 జూన్ 26న ప్రకటించిన ఎమర్జెన్సీ(అత్యయిక పరిస్థితి)పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఇందిరాగాంధీ సలహామేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 ఆర్టికల్‌ను ఉపయోగిస్తూ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. తను రాసిన 'ద డ్రమటిక్ డికేడ్:ఇందిరా గాంధీ ఇయర్స్' పుస్తకంలో ఎమర్జెన్సీపై ప్రణబ్ తన అభిప్రాయాలు తెలియజేశారు. ఆ పుస్తకాన్ని ఈ రోజు విడుదల చేశారు.
ఎమర్జెన్సీ ప్రకటన వెలువడిన వెంటనే దేశంలో పలువురు ముఖ్యప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేశారు. అరెస్టులు తప్పించుకోవడానికి చాలామంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దేశంలో అసాధారణ రాజకీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆకాశవాణి మూగబోయింది. పత్రికలపై నిబంధనలు విధించారు. ఎమర్జెన్సీ కారణంగా ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించవలసి వచ్చిందని అప్పటి కేంద్ర మంత్రి వర్గంలో జూనియర్ మంత్రిగా ఉన్న ప్రణబ్ పేర్కొన్నారు. వాస్తవానికి ఇందిరా గాంధీకి ఎమర్జెన్సీకి సంబంధించిన రాజ్యాంగంలోని నిబంధనలు ఏవీ తెలియవని తెలిపారు. ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకునే విషయంలో అప్పటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్ధ శంకర్ రే కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు.
**