మరో 3 రోజులు ఆస్పత్రిలోనే ఇంద్రాణి
ఆత్మహత్యా యత్నం!
ఆస్పత్రిలో అపస్మారకంలో..
ముంబై: జైల్లో ఉండి ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఇంద్రాణి ముఖర్జీ మరో మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె సగం స్పృహలో ఉందని.. ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తూ, మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉంచుతామని ముంబై జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే శనివారం ఉదయం తెలిపారు. ఆమెకు అవసరమైన రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలను చేయించామని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో సీబీఐ బృందానికి కూడా చెప్పామని ఆయన అన్నారు.
తన కూతురు షీనాబోరాను హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పరిస్థితి శనివారం అకస్మాత్తుగా విషమంగా మారింది. బైకలా జైల్లో ఉన్న ఆమె కొన్ని మాత్రలు వేసుకున్న వెంటనే ఊపిరి తీసుకోవటం కష్టంగా మారటంతో హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే ఆమె అపస్మారకంలో ఉన్నారని, పరిస్థితి విషమంగా ఉందని జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే ప్రకటించారు. ఎంఆర్‌ఐ స్కాన్ తీసినప్పుడు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నట్లు తేలిందని, వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నట్లు వివరించారు.
తనకు ఒంట్లో బాగాలేదని ఇంద్రాణి చెప్పటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు డీసీపీ మోహన్ దహికర్ చెప్పారు. ఆమె కడుపులోని ద్రవపదార్థాలను సేకరించి ఫోరెన్సిక్ దర్యాప్తునకు పంపించినట్లు ఆయన తెలిపారు. ఇంద్రాణి ఆరోగ్యం ఉన్నట్టుండి దెబ్బతినటంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక మరేదైనా తెలియని కారణం ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఆమె ఫిట్స్ నిరోధానికి వైద్యం చేయించుకుంటున్నారని జేజే ఆసుపత్రి డీన్ లహానే చెప్పారు. ఆ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి మాత్రమే, అది కూడా జైలు అధికారుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి. అయితే ఆ మాత్రలను అధిక మోతాదులో ఇంద్రాణి వాడారని.. దాని వల్లే అపస్మారక స్థితిలోనికి వెళ్లారని వైద్యులు అంటున్నారు. సెప్టెంబర్ 11 నుంచి ఆమె ఈ మాత్రలు వేసుకుంటున్నారు. అధిక మోతాదులో మాత్రలు ఆమె దగ్గరకు ఎలా చేరాయో తెలియటం లేదని సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు. ఇప్పటికే ఆమె కేసును విచారించిన ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాను ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ విచారణకు ఆదేశించారు.