దవాఖానాకు సుస్తీ : గాల్లో కలుస్తున్న పిల్లల ప్రాణాలు | Infants Deaths In Two Gujarats Government Hospitals | Sakshi
Sakshi News home page

దవాఖానాకు సుస్తీ : గాల్లో కలుస్తున్న పిల్లల ప్రాణాలు

Published Sun, Jan 5 2020 2:54 PM | Last Updated on Sun, Jan 5 2020 2:54 PM

 Infants Deaths In Two Gujarats Government Hospitals - Sakshi

గుజరాత్‌లోనూ కోట ఆస్పత్రుల్లో చిన్నారుల మృతి తరహా ఘటనలు కలకలం రేపుతున్నాయి.

అహ్మదాబాద్‌ : రాజస్థాన్‌లోని కోట ప్రభుత్వ ఆస్పత్రుల్లో చిన్నారుల మరణాలు కలకలం రేపిన నేపథ్యంలో తాజాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌, జామ్‌నగర్‌ ఆస్పత్రుల్లో కూడా గత ఏడాది డిసెంబర్‌లో 179 మంది చిన్నారులు మరణించడం వెలుగుచూసింది. రాజ్‌కోట్‌లో 111 మంది, జామ్‌నగర్‌లో నవంబర్‌ మాసంలో 71 మంది, డిసెంబర్‌లో 68 మంది నవజాత శిశువులు మరణించారని గణాంకాలు వెల్లడించాయి. రాజ్‌కోట్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో డిసెంబర్‌లో 111 మంది శిశివులు మరణించారని, వీరిలో కొందరు అండర్‌వెయిట్‌ చిన్నారులు కాగా, మరికొందరు సెప్పిస్‌ ఇన్‌ఫెక్షన్‌తో మృత్యువాత పడ్డారని ఆస్పత్రి సివిల్‌ సూపరింటెండెంట్‌ మనీష్‌ మెహతా చెప్పారు. ఇక జామ్‌నగర్‌లో గత ఏడాదిగా 639 మంది నవజాత శిశువులు మరణించారు.

అహ్మదాబాద్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొందని గడిచిన ఏడాది డిసెంబర్‌లో 85 మంది చిన్నారులు మరణించారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గన్వంత్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఈ ఆస్పత్రిలో నెలకు సగటున 70 నుంచి 80 మంది చిన్నారులు మరణిస్తున్నారని, పోషకాహారలోపమే చిన్నారుల మృతికి ప్రధాన కారణమని ఆయన చెప్పుకొచ్చారు. చోటా ఉదయ్‌పూర్‌ జిల్లాలో గత తొమ్మిదినెలలుగా 614 మంది చిన్నారులు మరణించడం కలకలం రేపింది. ఆయా ఆస్పత్రుల్లో పిల్లల వైద్యులు, చైల్డ్‌ స్పెషలిస్టులు లేకపోవడం కూడా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రోగుల సంఖ్యతో పోలిస్తే అందుకు అనుగుణంగా గైనకాలజిస్టులు, వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో పిల్లల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement