
'కేజ్రీవాల్‌ను చంపేందుకు ఇంకు దాడి రిహార్సల్'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను భౌతికంగా రూపుమాపే కుట్రకు ముందస్తు రిహార్సల్‌గానే ఆయనపై ఇంకు దాడి జరిగిందని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించింది. కేజ్రీవాల్‌కు భద్రత చేకూర్చడంలో ఢిల్లీ పోలీసులు కావాలనే తీవ్ర అలక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడింది.
'కేజ్రీవాల్‌ను హతమార్చే ప్రయత్నంలో భాగంగానే ఇంకు దాడి జరిగి ఉంటుందనే అంశాన్ని మేం కొట్టిపారేయడం లేదు' అని ఆప్ నేత అశుతోష్ పేర్కొన్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న కేజ్రీవాల్ ఇటీవల ఢిల్లీ నుంచి పంజాబ్‌కు ఓ ర్యాలీలో పాల్గొనేందుకు రైలులో వెళ్లారని, అయినా ఆయనకు భద్రతగా ఒక్క పోలీసు కూడా రైలులో వెంట రాలేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు నేరుగా కేంద్ర హోంశాఖకు కాకుండా ప్రధానమంత్రి కార్యాలయానికి రిపోర్ట్ చేస్తున్నారని, ఇందులో ఏదో తీవ్రమైన కుట్ర కనిపిస్తోందని ఆయన అన్నారు.