
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు రైల్వేశాఖ తెలిపింది. పట్టాలపై జనాలు ఉండటాన్ని గమనించిన లోకో పైలట్.. రైలును నిలిపివేసేందుకు ప్రయత్నించారని కానీ ఆ ప్రయత్నం విఫలమైందని రైల్వేశాఖ వెల్లడించింది. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 16మంది మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కర్మద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔరంగాబాద్-జల్నా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 6:30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. (మరో ప్రమాదం; ప్రధాని మోదీ ఆవేదన)
మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల జల్నాలోని ఐరన్ ఫ్యాక్టరీలో పనిచేసే వలస కూలీలు మధ్యప్రదేశ్‌కు తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. జల్నా నుంచి భూస్వాల్ వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి రైలులో మధ్యప్రదేశ్ వెళ్లాలని వారు భావించారు. అయితే దాదాపు 45 కి.మీ దూరం నడిచాక వారు రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment