
న్యూఢిల్లీ: వలస కార్మికులను స్వస్థలాలకు నడిచి వెళ్లకుండా ఆపడం ఎవరికీ సాధ్యంకాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారికి పునరావాసం, ఉచిత రవాణా కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. కేవలం వార్తా పత్రికల క్లిప్పింగుల ఆధారంగా దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించలేమని కొట్టేసింది. వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశామని కేంద్రం కోర్టుకు తెలిపిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నడిచి వెళ్లేవాళ్లను ఎవరు మాత్రం ఆపగలరు? ఎలా వారికి నచ్చజెప్పగలరు? వాళ్లను రైలు పట్టాలపై పడుకోకుండా ఎలా ఆపగలం’’ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. (కూలీలను చిదిమేసిన రైలు)
వాదనలు వినిపిస్తున్న క్రమంలో పిటిషనర్, న్యాయవాది అలాఖ్ అలోక్ శ్రీవాస్తవ ఔరంగాబాద్‌లో 16 మంది వలస కార్మికులు రైలు పట్టాలపై మృత్యువాత పడిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన కోర్టు... ‘‘ ప్రతీ న్యాయవాది న్యూస్ పేపర్ చదివి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. మీరు ఆ క్లిప్పింగుల ఆధారంగానే మమ్మల్ని కూడా చర్యలు తీసుకోమంటున్నారు. ఆ ఘటన గురించి రాష్ట్రాన్ని మాట్లాడనివ్వండి. ఈ విషయంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకోగలదు? మీకు ప్రత్యేకంగా ఓ పాస్ ఇప్పిస్తాం. మీరే అక్కడికి వెళ్లి ప్రభుత్వ ఆదేశాలను అమలయ్యేలా చూడండి. వలస కార్మికులు నడిచి వెళ్లకుండా ఆపండి’’అని బదులిచ్చింది.(ఆ పదహారు కూలీల పదహారణాల ఆత్మనిర్భరత)
అదే విధంగా ఒకరు నడిచి వెళ్లాలో లేదో పర్యవేక్షించడం కోర్టుకు సాధ్యం కాదని.. అందుకే ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని పేర్కొంది. కాగా లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు కాలినడకన స్వస్థలాలకు వెళ్తున్న దృశ్యాలు విస్తృతంగా బయటపడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన అనంతరం శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది నేటికీ నడిచి వెళ్తున్నారు. ఈ విషయం గురించి శ్రీవాస్తవ కోర్టును ఆశ్రయించగా... సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ... ‘‘కేంద్రం ఏర్పాట్లు చేసింది. అయినా కొంతమంది నడిచే వెళ్తున్నారు. వాళ్లంతా కాస్త ఓపిక పట్టాలి. వారి అవకాశం వచ్చేంత వరకు ఎదురుచూడాలి’’ అని పేర్కొన్నారు.(బడుగుజీవికి ‘బండె’డు కష్టాలు!)
Comments
Please login to add a commentAdd a comment