కరద్: సతారా జిల్లాలోని కరద్ అసెంబ్లీ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక్కడ తలపడుతున్న వారిలో ఒకరు రాజకీయాల్లో తలపండిన వారైతే అతని ప్రత్యర్థి రాష్ట్రాన్నే ఏలినవారు. ఒకరు వరుసగా ప్రజాభిమానంతో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినవారైతే, అతనిపై పోటీకి దిగిన వ్యక్తి అటు కేంద్ర మంత్రిగా ఇటు ముఖ్యమంత్రిగా పని చేసినవారు.
సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ఈ ఇద్దరు మహామహుల మధ్య పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగుతుండగా, ఆయన ప్రత్యర్థి 79 ఏళ్ల విలాస్‌రావ్ ఉండాల్కర్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరుసగా ఏడుసార్లు గెలిచిన వ్యక్తి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉండాల్కర్‌కు కాకుండా అతని స్థానంలో పృథ్వీరాజ్ చవాన్‌ను బరిలోకి దించింది. దీంతో ఉండాల్కర్ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పని చేసిన చవాన్ 2011లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరివీ విరుద్ధమైన వ్యక్తిత్వాలు. ఉండాల్కర్ ఈ ప్రాంతంలో కాకా పేరుతో ప్రసిద్ధులు. అమెరికాలో విద్యనభ్యసించిన చవాన్ రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించారు. చవాన్‌ను ఇక్కడి గ్రామాల ప్రజలు బాబా అని పిలుచుకుంటారు.
ధోవతి, కుర్తా ధరించే కాకా వద్ద కనీసం ఓ పెన్ను, లేదా మొబైల్ ఫోన్ కూడా ఉండదట. కానీ పార్టీ కార్యకర్తలను, నియోజకవర్గ ప్రజలను పేరు పెట్టి గుర్తించగలరని అతని మద్దతుదారులంటున్నారు. ఈ విషయంలో చవాన్ చాలా వెనుకబడి ఉన్నారనే చెప్పాలి. అయితే ముఖ్యమంత్రిగా చవాన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఇక్కడి అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.1,800 కోట్లు ఖర్చు చేశారు. మచ్చలేని వ్యక్తిత్వం, కరద్ అభివృద్ధికి ప్రత్యేక కృషి, తనతోపాటు తల్లిదండ్రులు ఆనంద్‌రావు, ప్రేమలతాయిలు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ప్రతినిధ్యం వహించడం వంటివి చవాన్‌కు కలసి వచ్చే అంశాలు.
బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న అతుల్ భోస్లే కూడా నిన్నటి దాకా కాంగ్రెస్ నాయకుడే. సహకార, విద్యా సంస్థల నెట్‌వర్క్ ఉన్న రాజకీయ కుటుంబంనుంచే ఈయన కూడా వచ్చాడు. కరద్ నియోజకవర్గంలో ఎన్సీపీ తన అభ్యర్థి రాజేంద్ర యాదవ్‌ను పోటీ నుంచి ఉపసంహరించి ఉండాల్కర్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో ఎన్సీపీపై కినుకు వహించిన యాదవ్‌ను చవాన్ చేరదీశారు.
తమకు తాగు, సాగు నీటి సమస్యను కాకా పరిష్కరించారని ఓ సర్పంచ్ చెప్పారు. ఈసారి పోటీ చేయడం కాకాకు ఇష్టం లేదని, కానీ తామే బలవంతపెట్టామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చే దాకా చవాన్ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఉండాల్కర్‌కు ప్రజాదరణ తగ్గిపోయిందని, 35 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన చెప్పుకోదగిన అభివృద్ధి పనులేమీ చేయలేదని చవాన్ మద్దతుదారులంటున్నారు. 2.75 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో చవాన్ తన ప్రత్యర్థికన్నా ఒక అడుగు ముందే ఉన్నప్పటికీ విజయం అంత సునాయాసం కాబోదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అభివృద్ధికి ఓటేయండి: సీఎం
నాసిక్: మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించిందని కాంగ్రెస్ పార్టీ అని, ప్రజలు అభివృద్ధి కోసం ఓటు వేయాలని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విజ్ఞప్తి చేశారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్తంగా ఉన్నప్పుడు 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిందని అన్నారు. తమ హయాంలోనే అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని చెప్పారు.
జిల్లాలోని పలు ఎన్నికల సభల్లో మాట్లాడిన చవాన్ తమ ప్రభుత్వాలు అమలు చేసిన పలు పథకాలను ఏకరువు పెట్టారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని, వాటిని కాంగ్రెస్‌పార్టీ మాత్రమే చేయగలదని చెప్పారు.
ఆసక్తికర పోరు
Published Mon, Oct 6 2014 10:07 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement