Satara
-
పర్యాటకుల స్వర్గధామం.. ‘కాస్ పీఠభూమి’
పింప్రి: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక మంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. మహారాష్ట్రలోనూ వర్షాకాలంలో అందమైన ప్రకృతి రమణీయమైన జలపాతాలు, పచ్చని కొండలు, లోయలు ఇలా అనేకం ఉన్నాయి. అయితే వీటిలో సాతారా జిల్లాలోని ఓ అందమైన ప్రాంతం.. జిల్లాకు 22 కి.మీ. దూరంలో ఉన్న ‘కాస్ పీఠభూమి’. ఒక అసాధారణమైన బయోస్పియర్, స్థానికులతోపాటు పర్యాటకులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ కేవలం ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో దాదాపు 300 రకాలకుపైగా వివిధ రకాలకు చెందిన రంగురంగుల పూలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కేవలం ఈ రెండు నెలల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు తండోపతండాలుగా దేశ, విదేశాల నుంచి తరలి వస్తారు. అదేవిధంగా మరెక్కడా చూడలేని రకరకాల పక్షులను ఈ ప్రాంతంలో చూసేందుకు ఇదే మంచి అవకాశం. పర్వత శిఖరాలపైన కనిపించే ఈ పీఠ భూములు హెలిప్యాడ్లను పోలి ఉంటాయి. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు మొదలయ్యేసరికి వివిధ రకాల గడ్డి పెరిగి, కొండలన్నీ పచ్చటి తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. దీంతో ఆ ప్రదేశానికి రంగులు వేసినట్లుగా పచ్చిక బయళ్లు.. వాటిపై రంగురంగుల బొట్లు పెట్టినట్లుగా వివిధ రకాల పూలు చూడముచ్చటగా కనిపిస్తాయి. పసుపు రంగు, ఇత ర రంగుల పుష్పాలతో రంగురంగు తివాచీలు పర చి మనకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రకృతి దృశ్యాలను తిలకించేందుకు, పలు రకాల పుష్పాలను, పక్షులను అధ్యయనం చేసేందుకు వృక్ష, జంతు శాస్త్ర నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీ ప్రియులు, పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ ప్రదేశానికి తరలివస్తుంటారు. పర్వత ప్రాంతం ఈ రెండు నెలల్లో పర్యాటకుల వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అయితే ఈ పీఠభూమికి కాలినడకన మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఈ ప్రకృతిని ఆస్వా దించిన పర్యాటకులకు ఈ ప్రదేశం తమ జీవితంలో ఒక మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రయాణం.. అత్యంత అద్భుతం.. సతారా నుంచి కాస్‌కు వెళ్లే మార్గం కొంత ఇరుకుగా ఉన్నప్పటికి పర్వతాలపైకి వెళ్తున్నంతసేపు పర్యాటకులను తాకే చల్లటి గాలులు మొత్తం శ్రమను దూరం చేస్తాయి. ముందుకు సాగుతున్నంతసేపూ ఎన్నో అద్భుతాలను, మనోహరమైన ప్రకృతి దృశ్యాలను కెమరాలలో బంధించవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్‌కు సంబంధించిన ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. దీంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు పూలను, మొక్కలను తెంచకపోవడం మరో విశేషం. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ వింత లోకాన్ని చూడడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. చూడాల్సిన ప్రదేశాలు.. కాస్లేక్.. కాస్ పీఠభూమి సముద్ర మట్టానికి 3,725 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ పీఠభూమి సహ్యాద్రి కొండల మధ్య గిన్నె ఆకారంలో కనిపిస్తుంది. కొయనా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా కాస్ లేక్ ఏర్పడింది. సతారా పట్టణానికి తాగునీటిని ఈ లేక్ నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ సరస్సు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. స్వచ్ఛతలో ఈ లేక్ దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఇక్కడ బోటింగ్ ఓ అద్భుత, చిరస్మరణీయ అనుభూతిని కల్గిస్తుంది. ఈ ప్రాంతం మొక్కలకు, వన్యజీవులకు అనుకూలంగా నిలుస్తుంది. భూలోకంలో స్వర్గాన్ని అనుభవించాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించి.. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సిందే. చల్కేవాడి.. వందలాది గాలి మరలు ఇక్కడ పర్వతాలపై మనకు టాటా చెబుతూ వీడ్కోలు పలుకుతుంటాయి. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు పలు సినిమా షూటింగ్‌లు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ గాలి మరల ద్వారా ఇక్కడ విద్యుచ్ఛక్తిని తయారు చేస్తున్నారు. అందుకే సతారా జిల్లాను ‘డిస్ట్రిక్ట్ ఆఫ్ పవర్’గా పిలుస్తున్నారు. చల్కేవాడి పవన నిలయంగా చెప్పవచ్చు. నైసర్గ్ ఆర్గానిక్ ఫార్మ్.. సతారాకు చెందిన శిందే ఈ ఆర్గానిక్ ఫామ్‌ను నడుపుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన సర్పగంధ, ఇన్సులిన్, తులసి లాంటి వివిధ మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు. ఇక్కడ సజ్జన్ఘడ్ కోటను కూడా చూడవచ్చు. (క్లిక్: ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు) తోసేఘర్ వాటర్ ఫాల్స్... సతారా నుంచి 20 కి.మీ. దూరాన తోసేఘర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ వెయ్యి అడుగుల పైనుంచి కిందున్న లోయలోకి పడుతుంటాయి. పర్యాటకులకు ఈ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. వేలాది మంది పర్యాటకులు ఈ జలపాతాలను చూడడానికి దేశ నలుమూలల నుంచి వస్తుంటారు. వాటర్ ఫాల్స్‌కు ఎదురుగా ఉన్న లోయపైన ఒక ప్లాట్‌ఫాంను నిర్మించడం వల్ల ఈ జలపాతాలను దగ్గరగా చూసేందుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి సాహస కృత్యాలు చేయకూడదు. గతంలో చాలామంది పర్యాటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇక్కడి ప్రకృతి అందా లు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. (క్లిక్: అదిరే..అదిరే.. అతిరాపల్లి వాటర్ ఫాల్స్) -
ఫస్ట్ టైమ్ పర్వతాలు పరవశించి... ఆశీర్వదించాయి!
‘మనుషులు పర్వతాలతో కలిసి కరచాలనం చేసినప్పుడు గొప్ప అద్భుతాలు సంభవిస్తాయి’ అలాంటి అద్భుతాలను అయిదుసార్లు చవిచూసి మాటలకు అందని మహా అనుభూతిని సొంతం చేసుకుంది ప్రియాంక మోహితే. తాజాగా ప్రపంచంలోనే మూడో ఎల్తైన శిఖరం కాంచన్‌జంగా(8,586 మీటర్లు)ను అధిరోహించి జేజేలు అందుకుంటోంది మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే. ఈ విజయం ద్వారా ప్రపంచంలోని ఎనిమిదివేల మీటర్లకు పైగా ఎత్తు ఉన్న అయిదు పర్వతశిఖరాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది. చిన్నప్పటి నుంచి పర్వతారోహణ గురించిన విషయాలు తెలుసుకోవడం, పర్వతారోహకులతో మాట్లాడడం అంటే ప్రియాంకకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను ప్రపంచం మెచ్చిన పర్వతారోహకురాలిగా మలిచింది. టీనేజ్‌లో తొలిసారిగా ఉత్తరాఖండ్‌లోని బందర్‌పంచ్ పర్వతశ్రేణిని అధిరోహించింది ప్రియాంక. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2013లో మౌంట్ ఎవరెస్ట్(8,849 మీ), 2016లో మౌంట్ మకలు(8,485 మీ), మౌంట్ కిలిమంజారో(5,895 మీ), 2018లో మౌంట్ లోట్సే (8,516 మీ), గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ (8,091 మీ) పర్వతాలను అధిరోహించింది. గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ అధిరోహించడానికి బయలుదేరేముందు కోవిడ్ భయాలు సద్దుమణగలేదు. రకరకాల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకతప్పలేదు. కొత్త విజయాన్ని నా ఖాతాలో వేసుకోబోతున్నాను...అంటూ ఒక వైపు అంతులేని ఆత్మవిశ్వాసం, మరోవైపు అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి విన్న భయంగొలిపే విషయాలు తన మనసులో కాసేపు సుడులు తిరిగాయి. అయితే చివరికి మాత్రం ప్రతికూల ఆలోచనలపై ఆత్మవిశ్వాసమే అద్భుత విజయాన్ని సాధించింది. స్ట్రెంత్ ట్రైనింగ్ నుంచి క్రాస్ ఫిట్ వరకు ప్రత్యేక దృష్టి పెట్టింది. సాహసయాత్రకు బయలుదేరేముందు– ‘ప్రతి విజయం తరువాత సోషల్ మీడియాలో నా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతున్నారు. ఈసారి కూడా అలాగే జరగాలని ఆశిస్తున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది ప్రియాంక. మౌంట్ అన్నపూర్ణను విజయవంతంగా అధిరోహించిన తరువాత సోషల్‌మీడియాలో ఆమె ఫాలోవర్స్ ఇబ్బడిముబ్బడిగా పెరిగారు. నాట్యం చేసిన పాదాలు పర్వతాలను ముద్డాడాయి (ప్రియాంకకు భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది)...అని కవిత్వం చెప్పినవారు కొందరైతే– ‘మీ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచిందో మాటల్లో చెప్పలేను’ అన్నవారు కొందరు. ప్రతి విజయ యాత్రకు ముందు– ‘నా కల నెరవేర్చుకోవడానికి బయలుదేరుతున్నాను’ అని పోస్ట్ పెడుతుంది ప్రియాంక. ఆ వాక్యానికి ఎన్నెన్ని ఆశీర్వాద బలాలు తోడవుతాయోగానీ ఆమె అద్భుత విజయాలను సాధిస్తుంటుంది. ముంబై యూనివర్శిటీలో బయోటెక్నాలజీలో పీజీ చేసిన ప్రియాంకకు పర్వతారోహణ అంటే టీనేజ్‌లో ఎంత ఉత్సాహంగా ఉండేదో, ఇప్పుడూ అంతే ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహమే 30 సంవత్సరాల ప్రియాంక బలం, మహా బలం! -
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గొర్రెల కాపరి..
సాక్షి ముంబై: సాతారా జిల్లాకి చెందిన 60 ఏళ్ల వృద్ధుడైన ఓ గొర్రెల కాపరి చెప్పులు ఇప్పుడు వార్తల్లోకెక్కాయి. ఈయన కాళ్లకు వేసుకునే చెప్పులు ఎనిమిది కిలోల బరువుతోపాటు నాగుపాము పడగ రూపంలోని ప్రత్యేక డిజైన్‌లో, బంగారు రంగులో ఉండటంతో ఈ చెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇలా అనేక ప్రత్యేకతలతో ఉన్న ఈ చెప్పులు రూ. 31 వేల విలువ ఉంటాయని ఆయన అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాదరక్షలు హల్చల్ చేస్తున్నాయి. సాతారా జిల్లా మాణ్ తాలూకాలోని జాంభుళణీ గ్రామంలో వృత్తి రీత్యా గొర్రెల కాపరి అయిన కెరాప్పా కోకరే ఈ చెప్పులు తయారు చేయించుకున్నారు. పొలాల్లో, కాలిబాటల్లో అత్యధిక సమయం గడిపే ఆయన వేషధారణ సైతం ప్రత్యేకంగా ఉంది. ధోతీ, చొక్కా, నెత్తిపై పసుపు రంగులో ఉండే పంచెతో కట్టిన తలపాగా (పగిడి)తోపాటు గ్రామీణ వస్త్రధారణతో ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పరిసరాల్లో జరిగే ‘గాజీ’ నృత్య ప్రదర్శనలో కెరప్పా కోకరే ఈ చెప్పలు వేసుకుని చిందులు వేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ చెప్పులను ఆయన ప్రత్యేకంగా ఆక్లూజ్లో తయారు చేయించుకున్నారు. కెరప్పా కొకరే ధరించే ఈ చెప్పులలో 100 ఎల్ఈడీ లైట్లు, గోండాలు, 100 గజ్జెలు, నట్‌బోల్టులు, గాజు బిళ్లలు, బ్యాటరీ తదితరాలున్నాయి. చదవండి: ('ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర') ముఖ్యంగా బంగారు రంగులో ఉండే ఈ చెప్పులు, ఉదయం, రాత్రి సమయాల్లో వైవిధ్యంగా కనిపిస్తూ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చెప్పుల కారణంగా కోకరే కెరప్పా తన గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చర్చల్లోకెక్కారు. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచే కోకరే కొరప్పాకు చెప్పులతోపాటు ప్రత్యేక వేషధారణ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన 60 ఏళ్ల వయసులో కూడా చెప్పులు, వేషధారణ అంతా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. స్వగ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే కార్యక్రమాలలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ముఖ్యంగా గాజి నృత్య ప్రదర్శనలో తనదైన నృత్యరీతిలో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఎనిమిది కిలోల బరువుతో, రూ. 31 వేల విలువైన ప్రత్యేక పాదరక్షలతో ఓ సెలబ్రిటీ అయిపోయారు. -
మహారాష్ట్రలో జల ప్రళయం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలతో జల ప్రళయం సంభవించింది. గడిచిన 48 గంటల్లో మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వర్షం సంబంధిత ఘటనల్లో 129 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. కొండచరియలు విరిగిపడి రాయ్‌గఢ్ జిల్లాలో తలియే గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటి వరకు 38 మంది మృతదేహాలను వెలికితీశారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకునిపోయారు. సతారా జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో 27 మంది చనిపోయారు. గోండియా, చంద్రాపూర్ జిల్లాల్లోనూ పలువురు మృత్యువాతపడ్డారు. రత్నగిరి జిల్లాలో 10 మంది, సతారా జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో 11 మంది, ముంబైలో భవనం కూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. భారీ వర్షాల కారణంగా చిప్లూన్ పట్టణం పూర్తిగా జలమయమైంది. ఇళ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, వీధులలో 4 నుంచి 14 అడుగుల మేర నిలిచింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో, కోవిడ్ ఆసుపత్రిలో వెంటిలేటర్లపై ఉన్న 8 మంది మృతి చెందారు. వరదల్లో చిక్కుకున్న వేలాది మందిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తోపాటు నేవీ ఇతర సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికుల సాయంతో యుద్ధప్రాతిపాదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కొంకణ్‌లోని ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి, పాల్ఘర్, పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్, సతారా, సాంగ్లీ, మరాఠ్వాడాలోని పర్భణీ, నాందేడ్, విదర్భలోని అకోలా జిల్లాల్లో మూడు, నాలుగు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ఈ జిల్లాల్లోని నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో నివాసాలు 15 అడుగుల మేర వరదలో నీట మునిగాయి. వందలాది గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి వర్షం కొంత విశ్రాంతి ఇవ్వడం, వరద తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యల్లో కొంత వేగం పెరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ఓ ప్రకటన వెలువడింది. మరోవైపు వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మరణించిన వారి పట్ల ప్రధాని సంతాపం వ్యక్తం చేశా రు. వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల సాయం అందించనున్ననట్లు తెలిపారు. తలియే గ్రామం జల సమాధి! రాయ్‌గఢ్ జిల్లా తలియే గ్రామం జల సమాధి అయింది. ఈ గ్రామంపై కొండచరియలు విరిగిపడడంతో మొత్తం 35 ఇళ్లలోని వారు సజీవ సమా ది అయ్యారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు అందిన వివరాల మేరకు 38 మృతదేహాలను బయటికి తీయగలిగారు. శిథిలాల కింద మరో 36 మందికిపైగా ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సంఘటన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదంతోపాటు కలకలాన్ని రేకెత్తించింది. గురువారం సాయం త్రం 4.30 గంటల ప్రాంతంలో తలియే గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ కింద ఉన్న ఈ గ్రామంలో సుమారు 35 ఇళ్లుండేవి. వరదలతో ఈ గ్రామమే కనపడకుండాపోయింది. తలి యే గ్రామం కన్పించకుండా మట్టిదిబ్బలు, బురదమయంగా మారింది. కొండప్రాం తంలో ఈ గ్రామం ఉండడం, రోడ్లు జలమయం కావడం, కుంగిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. -
కరోనాతో సీనియర్ నటి కన్నుమూత
ముంబై: బాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. మహమ్మారి కరోనా కాటుకు సీనియర్ నటి, ప్రముఖ థియేటర్ ఆర్టిస్టు ఆశాలత వాగోంకర్(79) బలైపోయారు. గత కొన్ని రోజులుగా సతారాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. కోవిడ్‌తో మృతిచెందిన ఆశాలత అంత్యక్రియలు సతారాలో నిర్వహించనున్నామని ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఇటీవలే ఓ మరాఠీ సీరియల్ షూటింగ్ నిమిత్తం సతారాకు వెళ్లిన ఆమెకు కరోనా సోకిందని, సోమవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. (చదవండి: 24 గంటలలో 75,083 పాజిటివ్ కేసులు) కాగా ఆశాలత మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నటీమణులు షబానా అజ్మీ, రేణుకా సహానేతో పాటు గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ ఆశాలత కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన నటనతో ఎన్నో తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచిన గోవా ఆర్టిస్టు ఆశాలత మరణం తీరని లోటు అని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ ముఖ్యమంత్రి ప్రార్థించారు. నాటక రంగం నుంచి సినిమాల్లోకి గోవాకు చెందిన ఆశాలత తొలుత కొంకణి, మరాఠీ భాషల్లో వందలాది నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి పలు మరాఠీ చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో బసు ఛటర్జీ అప్నే పరాయే సినిమాతో హిందీ తెరకు పరిచయం చేశారు. అంకుఖ్, అహిస్తా అహిస్తా వో సాత్ దిన్, నమక్ హలాల్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. Deeply pained by the passing away of acclaimed Goan Artist Ashalata Wabgaonkar. Her splendid performances in theatre & films will keep inspiring the generations to come. My condolences to her family & fans. May her soul rest in peace. pic.twitter.com/HVGOnDUA8x — Digambar Kamat (@digambarkamat) September 22, 2020 -
కళ్లెదుటే డబ్బులున్నా చలించని ధనాజీ..
పుణే: ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతున్నా కొందరు మాత్రం దాని మోజుకు దూరంగానే ఉంటారు. అలాంటి కోవలోకే వస్తాడు మహారాష్ట్రలోని సతారాకు చెందిన ధనాజీ జగ్దలే. తనకు ఓ బస్టాప్‌లో దొరికిన రూ.40 వేలను సొంతదారుకే తిరిగి ఇచ్చేశాడు. అంతేకాదు ఆ వ్యక్తి రూ.వేయి బహుమతిగా ఇస్తానంటే సున్నితంగా తిరస్కరించి, బస్సు చార్జీలకు కేవలం 7 రూపాయలు చాలన్నాడు. ధనాజీ నిజాయితీ మెచ్చిన సతారా ఎమ్మెల్యే శివేంద్రరాజే భోసలే, మాజీ ఎంపీ ఉదయన్‌రాజే భోసలే, మరికొన్ని సంస్థలు అతనికి సన్మానం చేశాయి. ఎన్నారై ఒకరు రూ.5 లక్షలు ధనాజీకి బహుమతిగా ఇవ్వడానికి ముందుకురాగా ఆ సొమ్మును కూడా తీసుకోలేదు. ఒకరి డబ్బు తో తనకు సంతృప్తి కలగదని, మనుషులు నిజాయితీతో బతకాలని ధనాజీ సందేశమిచ్చాడు. -
జోరు వర్షాన్ని లెక్కచేయకుండా.. పవార్.. పవర్!
సతారా: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్(80) చేవతగ్గలేదని మరోసారి నిరూపించారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ప్రచారం ఆఖరి రోజైన శనివారం సతారాలో ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. ఈ సందర్భంగా శరద్ పవార్ పార్టీ అభ్యర్థి ఎంపికలో తప్పు చేసినట్లు అంగీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘తప్పు చేస్తే ఒప్పుకోవాలి. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ఎంపికలో తప్పు చేశా. ఆ విషయాన్ని మీ ముందు అంగీకరిస్తున్నా. కానీ, ఆ తప్పును సరిదిద్దుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. 21న జరగనున్న పోలింగ్ కోసం సతారా ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో ఎన్సీపీకి వరుణ దేవుడి ఆశీస్సులు కూడా లభించాయి. వరుణుడి కటాక్షంతో సతారా ప్రజలు అద్భుతం సృష్టించబోతున్నారు’అని తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న మిగతా నేతలంతా వర్షంలో తడవకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ ఆయన ఆగలేదు. తడుస్తూనే ప్రసంగం కొనసాగించారు. పోరాట యోధుడు కాబట్టే శరద్ పవార్ 5 దశాబ్దాలుగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కాగా, సతారా ఉప ఎన్నికకుగాను ఛత్రపతి శివాజీ వంశీకుడు ఉదయన్ భోసాలేకు ఎన్సీపీ టికెట్ కేటాయిం చింది. ఆయన అనంతరం బీజేపీ తీర్థం పుచ్చు కుని, ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. -
వివాహితపై సామూహిక అత్యాచారం
ముంబై : ఓ వివాహితపై ఇద్దరు వ్యక్తులు సామూహిక ఆత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో కలకలం రేపింది. బాధితురాలి అత్యంత సన్నిహితుడే ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. మరో వ్యక్తితో కలిసి తనపై అత్యాచారానికి తెగబడినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని సతరకు చెందిన 25 ఏళ్ల మహిళ గత ఏడాది భర్త నుంచి విడాకులు తీసుకుని కూతురితో కలిసి నివాసముంటోంది. అయితే అప్పుడప్పుడు సోదరిని కలవాడనికి ముంబైలోని ఆమె ఇంటికి వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో తన సోదరి ఇంటి పక్కన నివాసముండే అంజద్ ఆలీ(30)తో పరిచయం ఏర్పడింది. ఆమె ముంబై వెళ్లిన ప్రతీసారి అతడిని కలిసేదని వారిద్దరు కలిసి షికార్లకు వెళ్లేవారు. దీంతో వారిద్దరి మధ్య చనువు పెరగడంతో ఆలీ మహిళ న్యూడ్ ఫోటోలను పంపమని అడగగా దానికి ఆమె ఆంగీకరించింది. అప్పటి నుంచి అతడు ఆమెను ఎప్పుడుపడితే అప్పుడు కలవమని వేధంచడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్టు వినకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ మహిళ అతడు చెప్పిన చోటుకు వెళ్లింది. దీంతో ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం తన స్నేహితుడు నూర్ షేక్‌తో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన ఘటనను తన సోదరికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
మంత్రాలయ వచ్చి నేను ఆత్మహత్య చేసుకోవాలా?
సాక్షి, సతారా : 'న్యాయం కోసం ప్రతి ఒక్క వృద్ధుడు మంత్రాలయ వచ్చి ఆత్మహత్యకు పాల్పడాల్సిందేనా?' ఈ ప్రశ్న వేసింది చంద్రశేఖర్ జంగం అనే వ్యక్తి. ఆయన వయసు ఇప్పుడు 98 ఏళ్లు. అయితే, ఆయన సామాన్యుడేం కాదు. గొప్ప పోరాటయోధుడు.. యుద్ధ వీరుడు. భారత ఆర్మీలో సైనికుడిగా విశిష్ట సేవలు అందించాడు. 1962లో చైనాతో, 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు. 1971 సుబేదార్ హోదాలో పదవీ విరమణ పొందారు. అయితే, ఒకప్పుడు ఈ దేశం కోసం పోరాడి చివరి మజిలీకి చేరిన సమయంలో ఆయన నోటి నుంచి ఆత్మహత్య మాట ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? సమస్య షరా మాములే. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు టోకరా పెట్టింది. సైనికులకు కేటాయించే భూమిని ఆయనకు కేటాయించలేదు. రెండు సార్లు ఆయన యుద్ధం నిలిచి గెలిచాడుగానీ, తన హక్కుల కోసం మాత్రం సొంత దేశంలోనే 54 ఏళ్లుగా ఓడిపోతూనే ఉన్నారు. చివరకు తనకు న్యాయం జరగడం కోసం మంత్రాలయ వచ్చి ఆత్మహత్యకు పాల్పడమంటారా అని ఆవేదనతో ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. చంద్రశేఖర్ జంగం తొలిసారిగా 1943లో భారత ఆర్మీలో చేరారు. ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్ కింద యుద్ధ ట్యాంకుల విభాగంలో పనిచేశారు. 1962లో ఇండో-చైనా, 1965 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. రక్ష మెడల్ కూడా స్వీకరించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సైనికులు స్థలం కొనుక్కునే అవకాశం ఉండటంతో 1964లో 15.5 గుంటల భూమిని సతారాలో కొనుగోలుచేశారు. అందుకు రూ.3,547లు చెల్లించారు. ఇప్పటికీ ఆ రశీదు కూడా ఉంది. అయితే, ఆ భూమిని మాత్రం చంద్రశేకర్‌కు బదిలీ చేయలేదు. ఆ ప్రొసీజర్ కూడా ముందుకు తీసుకెళ్లలేదు. దీంతో ఆయన 1968 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 1971లో ఆయన పదవీ విరమణ పొందాక కూడా ప్రతివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగారు. ఇక ఆ పనిపూర్తికాకపోవడంతో కనీసం తన డబ్బు తనకైనా తిరిగి ఇవ్వాలని 1977 నుంచి అడగడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ఆ పని కూడా జరగలేదు. 1983వరకు పోరాడిన వాళ్లు తిరిగి ఆశ వదులుకున్నారు. మళ్లీ చిగురించిన ఆశ సతారాలోని రహీమత్‌పూర్‌లో ఉంటున్న చంద్రశేఖర్‌కు ముగ్గురు కూతుర్లు.. ఇద్దరు కుమారులు. కుమారుల్లో ఒకరు తమకు ప్రభుత్వం చేసిన అన్యాయంపై గట్టిగా పోరాటం చేయాలనుకున్నారు. ఒక ఎన్జీవో, అఖిల్ భారతీయ వీర్షవ్య లింగాయత్ మహాసంఘ(ఏబీవీఎల్‌ఎం) సహాయంతో ఆర్టీఐ ద్వారా కొనుగోలు చేసిన భూమి వివరాలు రాబట్టాడు. అయితే, కొన్ని రికార్డులు లభించగా కొన్ని మాత్రం మాయమయ్యాయి. 15.5గుంటల భూమిని వారు కొనుగోలు చేయగా అందులో రోడ్డు విస్తరణకోసం దాదాపు సగానికిపైగా భూమి పోయి ఇప్పుడు 5.5గుంటలు మాత్రం మిగిలినట్లు తెలిసింది. దీంతో తమకు ఇక భూమి దక్కదని నిర్ణయించుకొని వేరే చోట అయినా కనీసం భూమి కేటాయించాలని కోరారు. గత వారం కుటుంబ సభ్యులు ఏబీవీఎల్‌ఎం చీఫ్ డాక్టర్ విజయ్ జంగమ్‌తో కలిసి మహారాష్ట్ర విధాన భవన్‌కు వెళ్లగా అక్కడి రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఫైల్ పంపించాలని ఆదేశించారు. అయితే, ఈ విషయంపై ఓ సీనియర్ కలెక్టర్ స్పందించి ప్రభుత్వం తలుచుకుంటే అది పెద్ద విషయం కాకపోయినా ఎందుకో ప్రతిసారి రివ్యూల పేరిట వాయిదాలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. -
ఆసక్తికర పోరు
కరద్: సతారా జిల్లాలోని కరద్ అసెంబ్లీ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక్కడ తలపడుతున్న వారిలో ఒకరు రాజకీయాల్లో తలపండిన వారైతే అతని ప్రత్యర్థి రాష్ట్రాన్నే ఏలినవారు. ఒకరు వరుసగా ప్రజాభిమానంతో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినవారైతే, అతనిపై పోటీకి దిగిన వ్యక్తి అటు కేంద్ర మంత్రిగా ఇటు ముఖ్యమంత్రిగా పని చేసినవారు. సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ఈ ఇద్దరు మహామహుల మధ్య పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగుతుండగా, ఆయన ప్రత్యర్థి 79 ఏళ్ల విలాస్‌రావ్ ఉండాల్కర్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరుసగా ఏడుసార్లు గెలిచిన వ్యక్తి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉండాల్కర్కు కాకుండా అతని స్థానంలో పృథ్వీరాజ్ చవాన్‌ను బరిలోకి దించింది. దీంతో ఉండాల్కర్ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పని చేసిన చవాన్ 2011లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరివీ విరుద్ధమైన వ్యక్తిత్వాలు. ఉండాల్కర్ ఈ ప్రాంతంలో కాకా పేరుతో ప్రసిద్ధులు. అమెరికాలో విద్యనభ్యసించిన చవాన్ రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించారు. చవాన్‌ను ఇక్కడి గ్రామాల ప్రజలు బాబా అని పిలుచుకుంటారు. ధోవతి, కుర్తా ధరించే కాకా వద్ద కనీసం ఓ పెన్ను, లేదా మొబైల్ ఫోన్ కూడా ఉండదట. కానీ పార్టీ కార్యకర్తలను, నియోజకవర్గ ప్రజలను పేరు పెట్టి గుర్తించగలరని అతని మద్దతుదారులంటున్నారు. ఈ విషయంలో చవాన్ చాలా వెనుకబడి ఉన్నారనే చెప్పాలి. అయితే ముఖ్యమంత్రిగా చవాన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఇక్కడి అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.1,800 కోట్లు ఖర్చు చేశారు. మచ్చలేని వ్యక్తిత్వం, కరద్ అభివృద్ధికి ప్రత్యేక కృషి, తనతోపాటు తల్లిదండ్రులు ఆనంద్‌రావు, ప్రేమలతాయిలు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ప్రతినిధ్యం వహించడం వంటివి చవాన్‌కు కలసి వచ్చే అంశాలు. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న అతుల్ భోస్లే కూడా నిన్నటి దాకా కాంగ్రెస్ నాయకుడే. సహకార, విద్యా సంస్థల నెట్వర్క్ ఉన్న రాజకీయ కుటుంబంనుంచే ఈయన కూడా వచ్చాడు. కరద్ నియోజకవర్గంలో ఎన్సీపీ తన అభ్యర్థి రాజేంద్ర యాదవ్‌ను పోటీ నుంచి ఉపసంహరించి ఉండాల్కర్కు మద్దతు ప్రకటించింది. దీంతో ఎన్సీపీపై కినుకు వహించిన యాదవ్‌ను చవాన్ చేరదీశారు. తమకు తాగు, సాగు నీటి సమస్యను కాకా పరిష్కరించారని ఓ సర్పంచ్ చెప్పారు. ఈసారి పోటీ చేయడం కాకాకు ఇష్టం లేదని, కానీ తామే బలవంతపెట్టామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చే దాకా చవాన్ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఉండాల్కర్కు ప్రజాదరణ తగ్గిపోయిందని, 35 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన చెప్పుకోదగిన అభివృద్ధి పనులేమీ చేయలేదని చవాన్ మద్దతుదారులంటున్నారు. 2.75 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో చవాన్ తన ప్రత్యర్థికన్నా ఒక అడుగు ముందే ఉన్నప్పటికీ విజయం అంత సునాయాసం కాబోదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అభివృద్ధికి ఓటేయండి: సీఎం నాసిక్: మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించిందని కాంగ్రెస్ పార్టీ అని, ప్రజలు అభివృద్ధి కోసం ఓటు వేయాలని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విజ్ఞప్తి చేశారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్తంగా ఉన్నప్పుడు 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిందని అన్నారు. తమ హయాంలోనే అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. జిల్లాలోని పలు ఎన్నికల సభల్లో మాట్లాడిన చవాన్ తమ ప్రభుత్వాలు అమలు చేసిన పలు పథకాలను ఏకరువు పెట్టారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని, వాటిని కాంగ్రెస్‌పార్టీ మాత్రమే చేయగలదని చెప్పారు.