కరుణించిన మృత్యువు! | Into a coma and died of aruna | Sakshi
Sakshi News home page

కరుణించిన మృత్యువు!

Published Tue, May 19 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

కరుణించిన మృత్యువు!

కరుణించిన మృత్యువు!

42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా
కోమాలో ఉండి కన్నుమూసిన
అత్యాచార బాధితురాలు
అరుణ షాన్‌బాగ్

 
ముంబై: కాలు కదలదు.. చేయి కదలదు.. కనురెప్పయినా వాలదు.. ప్రాణం ఉందన్న మాటేగానీ అవయవాలన్నీ అచేతనం. ఒక్క మాటలో జీవచ్ఛవం! ఒకటి కాదు.. రెం డు కాదు.. 42 ఏళ్ల నరకం!! ఈ నాలుగు దశాబ్దాల నరకానికి మృత్యువు ముగింపునిచ్చింది. అనుక్షణం తన కోసం తపించిన అరుణను తనతోపాటు తీసుకెళ్లింది. ఇన్నాళ్లూ రెప్పపడని ఆ కన్నులను తన చేతులతో శాశ్వతంగా మూసేసింది.

1973, నవంబర్ 27న ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో కామాంధుడి చేతిలో పాశవిక అత్యాచారానికి గురై ఇన్నాళ్లూ మంచంపైనే అచేతన స్థితి(కోమా)లో ఉన్న అరుణ షాన్‌బాగ్(66) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. వారం రోజుల నుంచి ఆమె తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతోంది. రక్త సంబంధీకులు వద్దనుకున్నా.. అరుణను ఇన్నాళ్లూ పసిపాపలా చూసుకున్న ఆసుపత్రి సిబ్బంది ఆమె ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అరుణ మృతికి రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీఎం ఫడ్నవిస్ సంతాపం తెలిపారు.

ఆమె జీవితంలో చీకటి నింపిన ఆరోజు: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హల్దీపూర్‌కు చెందిన అరుణ షాన్‌బాగ్‌కు అప్పుడు 25 ఏళ్లు. రోగులకు సేవ చేసే నర్సింగ్ వృత్తి అంటే ఇష్టం. ఆ మక్కువే ఆమెను ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్(కేఈఎంహెచ్) వైపు నడిపింది. నర్సుగా జీవితాన్ని ప్రారంభించింది. ఎప్పుడూ ఉత్సాహంగా, అందరితో కలివిడిగా ఉండే ఈమెపై అదే ఆసుపత్రిలో వార్డుబాయ్‌గా పనిచేసే సోహన్‌లాల్ భార్తా వాల్మీకి అనే దుర్మార్గుడి కన్ను పడింది. 1973, నవంబర్ 27 రాత్రి ఎప్పట్లాగే అరుణ విధులు ముగించుకుంది.

రూమ్‌కి వెళ్లేందుకు బేస్‌మెంట్‌లోని ఓ గదిలో బట్టలు మార్చుకుంటోంది. ఇదే సమయంలో సోహన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో కుక్కల్ని కట్టేసే గొలుసును ఆమె గొంతుకు బిగించాడు. పశువులా ప్రవర్తించి పారిపోయాడు. అతడి దాడితో మెడ నుంచి మెదడుకు వెళ్లే నాడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అరుణ అక్కడికక్కడే కుప్పకూలింది. కోమాలోకి వెళ్లిపోయింది. వెన్నెముక కూడా దెబ్బతింది. అప్పట్నుంచి అచేతనంగానే ఉండిపోయింది.

అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు: అరుణ మృతి వార్త తెలియగానే ఆమె బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. అంత్యక్రియలు తామే నిర్వహిస్తామనగా.. ఆసుపత్రి సిబ్బంది అందుకు ఒప్పుకోలేదు. చివరికి ఆమె బంధువులు, ఆసుపత్రి యాజమాన్యం సంయుక్తంగా దహనసంస్కారాలు నిర్వహించారు. ఆసుపత్రి డీన్, అరుణ మేనల్లుడు కలసి చితికి నిప్పంటించారు. అంతకుముందు ఆమె భౌతికకాయాన్ని రాష్ట్ర మంత్రి పంకజ్‌ముండేతోపాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. 42 ఏళ్ల పోరాటంలో ఓడిపోయినా.. కామాంధుల చేతుల్లో అన్యాయమౌతున్న అబల ఆర్తనాదాలు వినిపిస్తున్నంత కాలం నింగిలోని ఆ ‘అరుణ’ తార ఈ సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది!!
 
కామాంధుడికి ఏడేళ్ల శిక్షతో సరి..
సోహన్‌లాల్ పోలీసులకు చిక్కాడు. దోషిగా తేలాడు. కానీ అత్యాచారం కేసు కింద అతడిని శిక్షించలేదు. ఈ హేయమైన రాక్షస క్రీడను న్యాయస్థానం దొంగతనం, దాడిగానే చూసింది. ఒక్కో కేసు(దొంగతనం, దాడి)లో ఏడేళ్ల శిక్ష విధించాయి. ఆ శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పు చెప్పడంతో కేవలం ఏడేళ్ల శిక్ష అనుభవించి సోహన్‌లాల్ బయటకొచ్చాడు. ప్రస్తుతం పేరు మార్చుకుని ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడని తెలిసింది.
 
అరుణ కేసు.. న్యాయ చరిత్రలో ఓ మైలురాయి!
ఒంటి నిండా పుండ్లు, కదల్లేని అవయవాలతో కేఈఎం ఆసుపత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వార్డు నంబర్ 4లో బెడ్‌పై ఏళ్లుగా అరుణ అనుభవిస్తున్న బాధ ఎందరినో కలచివేసింది. వారిలో ఆమె స్నేహితురాలు, జర్నలిస్టు పింకి విరానీ ఒకరు. సంవత్సరాల తరబడి పడుతున్న బాధ నుంచి విముక్తి చేస్తూ అరుణను కారుణ్య మరణం కింద చంపేసేందుకు అనుమతించాలంటూ ఆమె 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇది అప్పట్లో కారుణ్య మరణంపై దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది.

వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. అరుణ పరిస్థితి తెలుసుకునేందుకు వైద్య నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం అదే ఏడాది మార్చి 7న కోర్టు చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. విరానీ పిటిషన్‌ను తోసిపుచ్చినా.. కారుణ్య నియామకానికి పాక్షిక చట్టబద్ధత కల్పించింది. నయం కాని రోగంతో శాశ్వత అచేతన స్థితి (పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్) ఉన్న రోగులను చట్టపరమైన విధివిధానాలకు లోబడి ప్రాణరక్షక వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగా తొలగించి, వారి మరణాన్ని వేగవంతం చేసే పరోక్ష కారుణ్య మరణానికి సానుకూలత ప్రకటించింది. తర్వాత కాలంలో అరుణ కన్నీటి జీవితంపై విరానీ ‘అరుణ స్టోరీ’ అనే పుస్తకం రాశారు. దత్తకుమార్ దేశాయ్ అనే మరాఠా రచయిత ‘కథ అరునాంచి’ అనే నాటకం రాశారు. ఈ నాటకం మహారాష్ట్రలో పలు చోట్ల ప్రదర్శితమైంది కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement