చెన్నై ఇంజనీరే ఆ.. జెండా రూపకర్త!
న్యూఢిల్లీః భారత్ లో ఐసిస్ భావజాలానికి ఆకర్షితులౌతున్న వారు ఇటీవలి కాలంలో పెరిగిపోతుండటం ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది. సిరియా ఇరాక్ లలో తమ ఉగ్రవాద కార్యకలాపాలకోసం వందలాది మందికి ఇస్లామిక్ స్టేట్ శిక్షణ కూడ ఇస్తున్న విషయం తెలిసిందే. తీవ్రవాద సంస్థ ఐసిస్ తో కలిసి నడిచేందుకు సిద్ధమౌతున్న భారతీయుల సంఖ్య కూడ తక్కువేం కాదు. ప్రస్తుతం ఆ ఉగ్రమూక తమకు గుర్తుగా వాడుకునే జెండా భారతీయుడే రూపొందించాడన్న విషయం వెలుగులోకి రావడం ఇప్పుడు అందర్నీ విస్మయపరుస్తోంది.
ఐసిస్ ఆనవాళ్ళు ఇండియాలో అప్పుడప్పుడూ బయట పడుతూనే ఉన్నాయి. అయితే ఇస్లామిక్ స్టేట్ కు గుర్తుగా వారి జెండాను భారత పౌరుడు రూపొందించాడన్న నిజం మాత్రం ఇప్పుడు అందర్నీ మరింత బాధపెడుతోంది. చెన్నైకు చెందిన 23 ఏళ్ళ మహ్మద్ నజీర్ ఐసిస్ జెండాను తయారు చేసినట్లు తాజాగా నేషనల్ ఇంటిటిజెన్స్ ఏజెన్సీ బయట పెట్టడం ఆందోళన రేకెత్తించింది. ఇస్లామిక్ స్టేట్ కోసం జెండాను, లోగోలను రూపొందించిన నజీర్.. చెన్పై కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసి, ఉద్యోగం కోసం 2014లో దుబాయ్ వెళ్ళాడు. కొన్నాళ్ళు అక్కడ వెబ్ డిజైనర్ గా పని చేసిన అతడు.. అనంతరం ఐసిస్ ప్రచార వీడియోలకు ఆకర్షితుడయ్యాడు.
గతేడాది సూడాన్ మీదుగా సిరియా వెళ్ళడానికి ప్రయత్నించి నజీర్ పోలీసులకు దొరికిపోయాడు. దేశభక్తుడైన నజీర్ తండ్రి అమిర్ మహ్మద్... నజీర్ ఐసిస్ లో చేరడానికి వెడుతున్నాడన్న వార్త తెలుసుకొని భద్రతాదళాలకు సమాచారం ఇవ్వడంతో... ఎన్ ఐ ఏ నజీర్ ను అదుపులోకి తీసుకుంది. అతడిపై ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. నజీర్ సూడాన్ వెడుతున్న క్రమంలో తాను ఐసిస్ లో చేరేందుకు వెడుతున్నానని, తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలంటూ తండ్రికి సమాచారం ఇవ్వడంతో.. విషయం తెలిసిన ఆయన.. ఇంటిలిజెన్స్ వర్గాలకు తెలిపారు. సూడాన్ అధికారులతో సంప్రదించిన ఎన్ ఐఏ నజీర్ ను పట్టుకొని ఇండియాకు తెచ్చి విచారిస్తుండగా... ఐసిస్ జెండాను నజీరే రూపొందించినట్లు కూడ తెలిసింది.