మావోలతో ఐసిస్ ములాఖత్
కోర్టులో ఎన్‌ఐఏ చార్జిషీట్
న్యూఢిల్లీ: భారత్‌లోని ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకర్తలు తమ దాడుల కార్యాచరణపై నక్సల్స్‌తో సంప్రదింపులు జరిపారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తెలిపింది. అలాగే నక్సల్స్ నుంచి ఆయుధాలు కూడా కొనాలనుకున్నారని చెప్పింది. భారత్‌లో ఐసిస్ రిక్రూటర్ షఫీ అర్మర్(పరారీలో ఉన్నాడు)తోసహా ఉగ్రకార్యకలాపాల్లో పాలుపంచుకున్న 16 మందిపై ముంబైలోని ప్రత్యేక కోర్టులో వేసిన అనుబంధ చార్జిషీటులో ఈమేరకు పేర్కొంది. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం, పేలుడు పదార్థాల చట్టం సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపింది.
అర్మర్‌తోపాటు మొహమ్మద్ నఫీస్ ఖాన్, ముదాబ్బిర్ ముస్తాఖ్ షేక్, అబు అనస్, నజ్ముల్ హుడా, మొహమ్మద్ అఫ్జల్ తదితరులు మావోయిస్టులతో సంప్రదింపులు జరిపారని చెప్పింది. జునూద్-ఉల్-ఖలీఫా-ఫిల్-హింద్ అనే సంస్థ ఐసిస్ కోసం పనిచేసేందుకు ముస్లిం యువతను నియామకం చేసేదని, అలాగే దేశంలో అర్మర్ తరఫున దాడులకు కుట్ర పన్నిందని ఎన్‌ఐఏ పేర్కొంది. అర్మర్ ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్, ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఇతర నిందితులతో సంప్రదింపులు జరిపినట్లు ఫోరెన్సిక్ ఆధారాలున్నాయంది.