భారత్ లో విధ్వంసానికి ఐఎస్, ఎల్ఈటీ కుట్రలు
న్యూఢిల్లీ: భీకర ఉగ్రదాడులతో ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఐఎస్ఐఎస్ కన్ను భారత్ పై ఇదివరకే ఉంది. మన ఇంటెలిజెన్స్ బృందాలు ఎక్కడికక్కడ ఐఎస్ ను నిర్వీర్యం చేయడంతో తోకముడిచింది. అయితే ఇప్పుడు మరో గుంటనక్క సాయంతో ఐఎస్ భారత్ లో విధ్వంసం సృష్టించాలనుకుంటోంది. తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాలకు జారీచేసిన హెచ్చరికల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
సిరియా, ఇరాక్ లలో ప్రాబల్యం ఉన్న ఐఎస్.. వివిధ దేశాల్లోని స్థానిక ఉగ్రమూకలతో సంబంధాలు పెట్టుకునే దిశగా ఎప్పటినుంచో పథకాలు రచిస్తోంది. ఆ క్రమంలోనే పాకిస్థాన్ కు చెందిన లష్కరే తాయిబా సంస్థతో టైఅప్ అయింది. 1990ల నుంచి భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోన్న లష్కరే సాయంతో మరిన్ని దాడులు జరపాలని ఐఎస్ భావిస్తున్నట్లు ఐబీ వర్గాలు పేర్కొన్నాయి. ఐఎస్ పథకం రూపొందస్తే, లష్కరే దానిని అమలు చేస్తుందని, వారికి ఆ అవకాశం కల్పించకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను ఐబీ హెచ్చరించింది. (చదవండి: ‘ఐఎస్ ఒంటరి తోడేలు దాడి’కి అవకాశం)