
హ్యకర్లు (ప్రతీకాత్మక చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన ఓ కీలక కంప్యూటర్ హ్యాకర్ల చేతికి చిక్కింది. భారత్, ఫ్రాన్స్‌లకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్స్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని హ్యాకర్లు చేజిక్కించుకున్నట్లు భావిస్తున్నామని చెప్పారు.
‘ఎక్స్‌ట్రీమ్ రాట్’ అనే పేరుతో పిలిచే ఈ మాల్‌వేర్‌ను ఇస్రో కంప్యూటర్‌లోకి హ్యాకర్లు చొప్పించినట్లు తెలిపారు. 2017 డిసెంబర్‌లో తొలిసారి ఎక్స్‌ట్రీమ్ రాట్‌ను ఇస్రోలోని ఒక సర్వర్‌లో కనుగొన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధకుడు రోబర్ట్ బాప్టిస్ట్ సాయంతో సదరు పోర్టును తాత్కాలికంగా ఇస్రో నిలిపివేసింది.
ఉపగ్రహాలను అదుపు చేసే వ్యవస్థలో..
అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాలను అదుపు చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండే ట్రాక్ చేసే ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్(ఇస్‌ట్రాక్)లో హ్యాకింగ్ జరగడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఎక్స్‌ట్రీమ్ రాకెట్ అంటే ?
వాణిజ్య అవసరాలకు వినియోగించే ‘రిమోట్ యాక్సెస్ ట్రోజెన్’ను ఎక్స్‌ట్రీం ర్యాట్ అంటారు. హ్యాకర్లు గూఢచర్య వ్యవహారాలకు దీనిని వినియోగిస్తారు. కీలక సమాచారాన్ని ఎక్స్‌ట్రీ ర్యాట్‌తో చోరీ చేసి డార్క్ నెట్‌లో దాన్ని అమ్మకానికి పెడతారు. అలా కొనుగోలు చేసిన వారు హ్యాకర్ ఇచ్చిన సమాచారంతో ఏమైనా చేసే పరిస్థితి ఉంటుంది.