జైపూర్: రాజస్తాన్‌లో టీ అమ్మే ఓ వ్యక్తి తన ఆరుగురు కూతుర్లకు కలిపి కట్నంగా ఏకంగా ఒకటిన్నర కోట్ల రూపాయలు ఇచ్చాడు. లీలా రామ్ గుజ్జర్ అనే వ్యక్తి ఏప్రిల్ 4న తన ఆరుగురు కుమార్తెలకు ఒకే ముహూర్తానికి పెళ్లి చేశాడు. ఈ సందర్భంగా రూ.1.51 కోట్ల నగదును గట్టిగా లెక్కపెట్టి గ్రామస్తులందరి ముందు మగపెళ్లి వారికి అందించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చి, ఆదాయపు పన్ను అధికారులు ఈ కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో లెక్కలు చెప్పాలంటూ అధికారులు అతనికి బుధవారం నోటీసులు పంపారు. సరైన ఆధారాలు చూపించకపోతే పన్ను వసూలు చేయనున్నారు. గుజ్జర్ కుమార్తెల్లో నలుగురు మైనర్లేననీ, వారికి పెళ్లి చేసిన నేరంపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గుజ్జర్ కుటుంబం పరారీలో ఉంది.